Begin typing your search above and press return to search.

ప్రభాస్ పెళ్లి తరువాతనే ఆమె పెళ్లట

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, పర్సనల్ లైఫ్స్ గురించి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

By:  M Prashanth   |   22 Jun 2026 9:39 AM IST
ప్రభాస్ పెళ్లి తరువాతనే ఆమె పెళ్లట
X

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, పర్సనల్ లైఫ్స్ గురించి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న చాలా ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు అదే అంశాన్ని దర్శకురాలు నందినీ రెడ్డి సరదాగా ప్రస్తావించడంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నందినీ రెడ్డి, ప్రమోషన్స్ సందర్భంగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్ గారు పెళ్లి చేసుకున్న వెంటనే నేను కూడా పెళ్లి చేసుకుంటాను' అంటూ నవ్వుతూ చేసిన కామెంట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు, ప్రభాస్ తన క్రష్ అని కూడా ఆమె సరదాగా వెల్లడించారు. 'ప్రభాస్ గారిని నా ముందుకు తీసుకొస్తే సిగ్గుపడతానేమో' అని చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది.

అయితే ఆ కామెంట్స్ వెనుక ఫన్ మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితంపై నందినీ రెడ్డి చెప్పిన కొన్ని నిజాయితీ గల విషయాలు కూడా ఉన్నాయి. గతంలో ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డానని, కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదని చెప్పారు. తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత తన ఆలోచనలను, ప్రొఫెషన్ అర్థం చేసుకునే వ్యక్తి దొరకలేదని వెల్లడించారు..

దర్శకురాలిగా పని చేయడం చాలా డిమాండింగ్ జాబ్ అని నందినీ రెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమాల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని, అలాంటి లైఫ్ స్టైల్ ను అర్థం చేసుకునే పార్టనర్ అవసరమని చెప్పారు. తనకు కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా అవి సరైనవిగా అనిపించలేదని తెలిపారు. అందుకే పెళ్లి విషయంలో ఎలాంటి తొందర పడలేదన్నారు.

అయితే పెళ్లి చేసుకోవద్దని ఎప్పుడూ నిర్ణయించుకోలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. సరైన వ్యక్తి ఎదురైతే భవిష్యత్తులో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. 'నెవర్ నో... ఎవరైనా నచ్చితే చేసుకుంటానేమో' అంటూ చిరునవ్వుతో స్పందించారు. మరోవైపు ఒంటరితనం గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎప్పుడూ తనకు అండగా ఉంటారని చెప్పారు.

చిన్నప్పటి నుంచి తనకు తనతో తాను గడపడం ఇష్టమని, పుస్తకాలు చదువుతూ గంటల తరబడి ఒంటరిగా ఉండగలనని తెలిపారు. అందువల్ల పెళ్లి కాలేదనే వెలితి తనకు ఎప్పుడూ అనిపించలేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నందినీ రెడ్డి, లిటిల్ సోల్జర్స్ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్‌ గా జర్నీ ప్రారంభించారు. అనంతరం అలా మొదలైందితో దర్శకురాలిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించారు. తర్వాత కల్యాణ వైభోగమే, ఓ బేబీ, అన్నీ మంచి శకునములే వంటి చిత్రాలతో మెప్పించారు.

ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్న నందినీ రెడ్డి చేసిన ప్రభాస్-పెళ్లి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. అయితే ఆ కామెంట్స్ వెనుక ఉన్న అసలు మెసేజ్ మాత్రం ఒక్కటే. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదు. సరైన వ్యక్తి దొరికితే జరుగుతుంది.. లేకపోయినా తన జీవితంతో తాను సంతోషంగా ఉండొచ్చని నందినీ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది.