'అఖండ 2' రికార్డులు కొడుతుంది: నందమూరి తమన్
నందమూరి బాలకృష్ణతో సంగీత దర్శకుడు తమన్ అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్బీకే స్వయంగా నందమూరి తమన్ అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:33 PM ISTనందమూరి బాలకృష్ణతో సంగీత దర్శకుడు తమన్ అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్బీకే స్వయంగా నందమూరి తమన్ అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`కు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు థమన్. ఆ తర్వాత వరుసగా బాలయ్య బాబు సినిమాలకు అతడే మ్యూజిక్ డైరెక్టర్.
ప్రతిసారీ ఆడియో వేదికపైకి వచ్చినప్పుడు నందమూరి తమన్ అని పిలుపందుకుంటున్నాడు. ఇప్పుడు కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -యూకే గౌరవం అందుకున్న వేదికపైనా నందమూరి బాలకృష్ణ స్వయంగా తమన్ ని ఆహ్వానిస్తూ `నందమూరి తమన్` అని పిలిచారు. నందమూరి థమన్ గారు వెల్‌కమ్ అంటూ యాంకర్ కూడా ఆహ్వానించడం విశేషం. భారతీయ సినీపరిశ్రమలో ఒక సంగీత దర్శకుడిని ఒక హీరో ఇంతగా వోన్ చేసుకోవడం అనేది చాలా అరుదు. కానీ ఈ అరుదైన అభిమానం సంపాదించుకున్నాడు తమన్. బాలయ్య కోసం థమన్ ఇచ్చే సౌండ్, థియేటర్లలో రీసౌండ్ గా మారి బాక్సులు బద్ధలైపోవాల్సిందే. ఇదే అనుబంధం ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.
ఇక ఎన్బీకే 50 వసంతాల నటనా కెరీర్ గురించి వక్తలు మాట్లాడుతుంటే... ఇదే వేదికపై తమన్ కూడా బాలయ్య గురించి స్ఫూర్తి వంతమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. ``బాలయ్య గారిని చూస్తే మాట్లాడలేం.. ఏదో ఒకటి కొట్టాలి అనిపిస్తుంది.. నాకు చేతిలో ఏవో రెండు మొలుస్తాయి.. కర్రలు.. కత్తులు.. నాకు కూడా అర్థం కాదు. నా డిఎన్‌ఏని బ్లడ్ ని టెస్ట్ చేయాలి. డాక్టర్ ని అడగాలి`` అని అన్నారు. ఎన్బీకే సినిమా కోసం మ్యూజిక్ కొట్టడం అంటే తనకు ఎంత ఇష్టమో తమన్ ఈ వేదికపై మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.
ప్రతిసారీ బాలయ్య కోసం పని చేస్తుంటే ప్యూరిటీ కనిపిస్తుందని, ఎనర్జీ వస్తుందని కూడా తమన్ అన్నారు. రేపు మా సినిమా అఖండ 2 వస్తోంది... చాలా రికార్డులు కొడుతుంది..అఖండకు ముందు -అఖండకు తర్వాత అని అంటారు. నాకు నా మ్యూజిక్ కి పునర్జన్మ ఇచ్చింది ఎన్బీకే. నటుడిగా ఆయన 50 ఏళ్ల జర్నీలో నేను ఉన్నాను. నా మొదటి సినిమా భైరవ ద్వీపం` అనేది మీకు కూడా తెలుసు.. బాలయ్య సినిమా నాకు రావడం అంటే బాలుడికి టాయ్ దొరకడమే.. నేను అలా సమర్థంగా ఉపయోగిస్తాను... బాలయ్య గారి దగ్గరకు వెళ్లి వస్తే గుడికి వెళ్లినంత ప్యూరిటీ కనిపిస్తుందని తమన్ ముగించారు.
