నందమూరి ఇంట విషాదం.. హీరో చైతన్య కృష్ణ తల్లి మృతి!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు మోసిన కుటుంబంగా పేరు సొంతం చేసుకున్న నందమూరి కుటుంబంలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి.
By: Madhu Reddy | 19 Aug 2025 11:48 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరు మోసిన కుటుంబంగా పేరు సొంతం చేసుకున్న నందమూరి కుటుంబంలో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారట. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే చికిత్స తీసుకుంటూ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
పద్మజ మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. పద్మజ.. జయకృష్ణ భార్య మాత్రమే కాదు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి కూడా. అంటే ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి..పద్మజ మరణవార్త విని విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి హుటాహుటిన హైదరాబాద్ ఫిలింనగర్ కి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం పద్మజ వయసు 73 సంవత్సరాలు.
నందమూరి జయకృష్ణ - దగ్గుబాటి పద్మజ దంపతుల కుమారుడు ఎవరో కాదు ప్రముఖ నందమూరి హీరో చైతన్య కృష్ణ. ఈయన తొలుత సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ మొదలుపెట్టి..ఆ తర్వాత జగపతిబాబు హీరోగా వచ్చిన 'ధమ్' సినిమాతో నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇందులో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్ర పోషించడంతో ఆయనని ఎవరు గుర్తించలేదు. ఆ తరువాత 'బ్రీత్' అనే సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను పలకరించారు. కానీ మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను మూటకట్టుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత ఒక కో డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇంతలోనే తల్లి మరణం ఆయనను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.
