Begin typing your search above and press return to search.

నంద‌మూరి లెగ‌సీ ఒత్తిడి నాకు అర్థమవుతోంది.. మోక్ష‌జ్ఞ‌పై ఎంపి శ్రీ‌భ‌ర‌త్!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఆయన అల్లుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి.

By:  Sivaji Kontham   |   12 Oct 2026 10:27 PM IST
నంద‌మూరి లెగ‌సీ ఒత్తిడి నాకు అర్థమవుతోంది.. మోక్ష‌జ్ఞ‌పై ఎంపి శ్రీ‌భ‌ర‌త్!
X

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఆయన అల్లుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఒక సాధారణ కొత్త నటుడికి ఉండే పరిస్థితులకు, నందమూరి వారసత్వం అనే కొండంత బరువు బాధ్యతలతో పరిశ్రమలోకి వచ్చే హీరో ఎదుర్కొనే సవాళ్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో ఎంతో విశ్లేషణాత్మకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడిన విష‌యాల‌ను ప‌రిశీలిస్తే..ఒక వైపు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా, మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి రావడం అంటే మోక్షజ్ఞపై విప‌రీత‌మైన ఒత్తిడి ఉంటుందని.. ఆ విషయంలో తనకు మోక్షజ్ఞపై కొంత సానుభూతి ఉందని శ్రీభారత్ తెలిపారు. సాధారణంగా ఒక కొత్త నటుడు విఫలమైతే ఎవరూ అంతగా పట్టించుకోరని.. కానీ ఇంతటి ఘనమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి విషయంలో ప్రేక్షకులు - మీడియా ప్రతి చిన్న అంశాన్ని ఎంతో సూక్ష్మంగా గమనిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగతంగా ఒక‌ సలహా ఇవ్వాల్సి వ‌స్తే.. తాత, తండ్రి సినిమాలు తీశారు కదా అని కేవలం ఆ కారణంతోనే సినీ పరిశ్రమలోకి రాకూడదని.. స్వయంకృషి ..సొంత ఆసక్తితోనే అడుగుపెట్టాలని తాను మోక్షజ్ఞకు నిరంతరం చెబుతుంటానని పేర్కొన్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతటి పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా న‌ట‌వారసత్వం (లెగ‌సీ) అనే ట్యాగ్ తెచ్చే ఒత్తిడి అసాధారణమైనది. మొదటి సినిమాతోనే ఘనవిజయాలు సాధించిన రామ్ చరణ్, హృతిక్ రోషన్ వంటి గ్లోబల్ స్టార్లు కూడా తమ కెరీర్ ప్రారంభంలో కుటుంబ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఒక పెద్ద నందమూరి కుటుంబం నుంచి వచ్చినా.. ప్రారంభంలో ఎవరి అండదండలు లేకుండా తన సొంత కష్టంతోనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యానని పలు సందర్భాల్లో వెల్లడించారు.

అదేవిధంగా అక్కినేని నటవారసుడు అఖిల్ అరంగేట్రం సమయంలోనూ విపరీతమైన అంచనాలు- ఒత్తిడి ఎదుర‌య్యాయి. కెరీర్ ఆరంభంలోనే వివి వినాయక్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పని చేసినప్పటికీ, ఆశించిన ఫలితం దక్కకపోవడంతో సరైన విజయం కోసం అత‌డు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఉదాహరణలన్నీ పరిశీలిస్తే.. ఎంతటి భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ప్రేక్షకుల మెప్పు పొంది నిలదొక్కుకోవడం అనేది ఎంతటి కష్టంతో కూడుకున్నదో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీపై ఎంపీ శ్రీభారత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత యథార్థమైనవని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.