Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ... 21 నుంచి 31 వరకు అదే వెయిటింగ్‌!

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చి చాలా కాలం అయింది. ఒకరు ఇద్దరు వచ్చినప్పటికీ అందరి దృష్టి నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఉంది.

By:  Ramesh Palla   |   24 Jan 2026 5:00 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీ... 21 నుంచి 31 వరకు అదే వెయిటింగ్‌!
X

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో వచ్చి చాలా కాలం అయింది. ఒకరు ఇద్దరు వచ్చినప్పటికీ అందరి దృష్టి నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఉంది. చాలా కాలం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఆ మధ్య మోక్షజ్ఞ చాలా బరువు ఉన్న కారణంగా సన్నబడ్డ తర్వాత హీరోగా సినిమా చేస్తాడని అంతా భావించారు. ఇప్పుడు సన్నగా, నాజుకుగా లవర్‌ బాయ్‌ మాదిరిగా మారాడు. అయినా కూడా సినిమాను చేయడం లేదు. ఆ మధ్య హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక భారీ విజువల్ వండర్‌ మూవీతో మోక్షజ్ఞ రాబోతున్నాడు అని అధికారికంగా ప్రకటన వచ్చింది. తీరా చూస్తే సినిమా పట్టాలెక్కలేదు. సినిమా క్యాన్సల్‌ అయిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంత్‌ వర్మ ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞతో సినిమా అసలు లేనట్లే అని తేలిపోయింది.

బాలకృష్ణ నట వారసుడు..

మోక్షజ్ఞ 21 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అప్పట్లో బాలకృష్ణ సినిమా ఒకటి ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతున్న సమయంలో మోక్షజ్ఞ పాల్గొన్నాడు. అప్పుడే త్వరలోనే మీ ముందుకు మోక్షజ్ఞ ను తీసుకు వస్తాను అంటూ బాలయ్య హమీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు సినిమా లేదు. బాలయ్య తన వద్ద పదుల కొద్ది కథలు ఉన్నాయని, మోక్షజ్ఞ కోసం చాలా కథలు వింటున్నట్లు చెప్పాడు. అంతే కాకుండా తన దర్శకత్వంలో రాబోతున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడు అంటూ బాలయ్య పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. మంచి కథ కోసం వెయిట్‌ చేస్తున్న మోక్షజ్ఞ ఈ ఏడాదిలో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాడా అంటే కష్టమే అని చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మోక్షజ్ఞ వయసు 31..

ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 31 ఏళ్లు. ఇప్పటికి కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వకుంటే నాలుగు పదుల వయసులో హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా ఏంటి అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కనీసం 20 ఏళ్లు కూడా రాకుండానే సినిమాల్లో నటించాడు. 20 ఏళ్ల వయసులో సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన విషయం తెల్సిందే. ఇంకా చాలా మంది స్టార్స్‌ కిడ్స్ సైతం 20 ఏళ్ల వయసులో లేదా మూడు పదుల వయసు రాకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది కరెక్ట్‌ నిర్ణయం. కానీ మోక్షజ్ఞ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగు పెట్టక పోవడంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చేది ఎప్పుడు, హిట్‌ కొట్టేది ఎప్పుడు, పెళ్లి చేసుకునేది ఎప్పుడు అన్నట్లుగా నందమూరి అభిమానులే అసహనంతో ఉన్నారు. బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ మోక్షజ్ఞ ను పట్టించుకోవడం లేదని కొందరి ఆరోపణ.

ఎన్టీఆర్‌ హీరోగా 20 ఏళ్లకే స్టార్‌

మోక్షజ్ఞ వయసు పెరిగి పోతున్నప్పటికీ ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం స్టార్‌ హీరోలుగా ఇండస్ట్రీలో ఉన్న వారు 30 ఏళ్ల వయసుకు తమను తాము నిరూపించుకున్నారు. అందుకే మోక్షజ్ఞ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి నిరూపించుకోవాల్సిందిగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, మంచి కథ, మంచి దర్శకుడు అంటూ వెయిట్‌ చేస్తే పుణ్య కాలం కాస్త పూర్తి అయ్యి పోతుందని, ఇప్పటికి అయినా మోక్షు మేలుకోవాలని, సినిమాను కమిట్ అయ్యి, స్పీడ్‌గా సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు మోక్షు సినిమా మొదలు పెట్టినా 2026 లో విడుదల అనేది సాధ్యం కాకపోవచ్చు అని కొందరు అంటున్నారు. కనుక మరో ఏడాది పాటు మోక్షజ్ఞ సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేయాల్సిందే. ఆ తర్వాత అయినా వస్తుందా అంటే ఏమో అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. మరి బాలయ్య ఏమంటారు అనేది చూడాలి.