అలాంటి తప్పుడు ప్రచారానికి NBK ఇలా వినయంగా చెక్
ప్రముఖులు తమ ఆస్తులను కోల్పోవడం ఇష్టం లేక హైదరాబాద్- కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
By: Sivaji Kontham | 12 Oct 2026 9:19 AM ISTప్రముఖులు తమ ఆస్తులను కోల్పోవడం ఇష్టం లేక హైదరాబాద్- కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సాకుతో కీలకమైన అభివృద్ధి ప్రాజెక్ట్‌లు .. ఫ్లైఓవర్ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ నటసింహం నందమూరి బాలకృష్ణ తన 863 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడం చర్చనీయాంశమైంది.
ఎన్బీకేతో పాటు ఆ ప్రాంత ప్రముఖులు రోడ్ వైడెనింగ్ కి అడ్డు తగులుతున్నారనే ప్రచారాన్ని ఈ చర్యతో గట్టిగా తిప్పికొట్టారు ఎన్బీకే. అంతేకాదు ఇలా తన ఇంటిని రోడ్ వైడెనింగ్ కి ఇచ్చేసినందుకు ఎన్బీకే ఎలాంటి తాయిలాలు అందుకోలేదని సమాచారం. దానిని ఆయన ఉచితంగా దానమిచ్చారు. ఎలాంటి సంకోచం లేకుండా తన నివాస స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వదులుకోవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్బీకే తనవంతుగా పూర్తి మద్దతు తెలిపారు.
అయితే ఈ ఇంటిని ఎన్బీకే వదులుకున్న క్రమంలో అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 80లలో ఇదే ఇంటి స్థలంలో ఎన్టీఆర్ తన రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలు, చర్చలు నిర్వహించేవారట. ఆ తర్వాత నందమూరి కుటుంబం అక్కడ ఆ ఇంటిని ఎంతో సెంటిమెంట్ గా నిర్మించుకుంది. ప్రస్తుతం ఈ ఇంటి స్థలం ఖరీదు వందల కోట్లు. అయినా దానిని తృణప్రాయంగా త్యజించారు. ప్రస్తుతం ఈ ఆస్తి నుండి మారుతున్న బాలకృష్ణ..జూబ్లీహిల్స్‌లో సరికొత్త నివాసాన్ని నిర్మిస్తున్నారని సమాచారం ఉంది. త్వరలోనే ఆయన ఆ కొత్త ఇంటికి మారే అవకాశాలు ఉన్నాయి.
కొత్త ఇంటి బడ్జెట్ ఊహించనంతగా..
నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్‌లో కొనుగోలు చేసి నిర్మిస్తున్న కొత్త నివాసానికి సంబంధించిన వివరాలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. 2021 ఫిబ్రవరి 11న తన భార్య నందమూరి వసుంధరా దేవితో కలిసి నాదింపల్లి సత్య శ్రావణి నుండి ఆయన ఈ ఆస్తిని సుమారు రూ. 15 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేశారు. దాదాపు 9,395 నుండి 9,935 చదరపు అడుగుల విశాలమైన బిల్టప్ ఏరియాతో.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తులుగా (జీ+2) ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఈ అత్యాధునిక భవనంలో ప్రైవేట్ హోమ్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్ -ప్రత్యేకంగా పూజా గది వంటి అనేక అధునాతన వసతులు కల్పించారు. ఇక ఈ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ పనులను శ్రీమతి వసుంధరా దేవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం ప్రస్తుతం ఈ కొత్త నివాసానికి సంబంధించిన నిర్మాణ పనులు, అంతర్గత అలంకరణ పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా.. త్వరలోనే బాలకృష్ణ ఈ గృహంలోకి మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లోని పాపులర్ సెలబ్రిటీలు నివశించే ప్రాంతంలోనే ఈ ఇల్లు ఉంది. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి కూడా ఇది సమీపంగా ఉందని ఇప్పటికే మీడియాలో కథనాలొచ్చాయి. ప్రాపర్టీ కొనుగోలు కోసమే రూ. 15 కోట్లు వెచ్చించగా, నిర్మాణ పనులు- ఖరీదైన ఇంటీరియర్స్ ఖర్చులతో కలిపి ఈ ఇంటి నిర్మాణం కోసం మొత్తం వ్యయం వంద కోట్లు పైగా ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. తన పాత నివాసంలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణకు స్వచ్ఛందంగా వదిలేసిన బాలకృష్ణ.. త్వరలోనే ఈ సరికొత్త లగ్జరీ నివాసంలోకి అడుగుపెట్టనున్నారు.
