తెలంగాణ రైతులకు NBK 50లక్షల విరాళం
ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్టు వెల్లడించారు.
By: Sivaji Kontham | 31 Aug 2025 10:07 AM ISTకామారెడ్డిలోని జగిత్యాల జిల్లాలో వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన రైతులకు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 50 లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్టు వెల్లడించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -యుకే లో స్థానం సంపాదించిన బాలయ్య శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘన సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీరాజకీయ ప్రముఖులు హాజరు కాగా, వేడుక ఆద్యంతం ఎన్బీకే మాటల తూటాలు అభిమానుల గుండెల్లోకి దూసుకెళ్లాయి.
భారతీయ సినిమాలో 50 ఏళ్ల పాటు నటుడిగా సేవలందించినందున నందమూరి బాలకృష్ణను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన గోల్డ్ ఎడిషన్‌లో చేర్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు బండి సంజయ్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే ప్రదర్శించిన ధాతృత్వంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. కార్యక్రమానికి హాజరైన గౌరవనీయ మంత్రులు ఇతర ప్రముఖులు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. నా మనవరాళ్లతో నేను నిరంతరం వాదిస్తుంటాను. కిడ్స్ నన్ను తాత అని కాదు `బాలా` అని పిలుస్తారు. వారు నా మాట వినకపోతే.. నేను వారికి పూత పూస్తాను (నవ్వుతూ).. అని సరదాగా ముచ్చటించారు. నాకు సంఖ్యలంటే భయం. నేను ఎన్ని సినిమాలు చేశానో తప్ప, నా సినిమాలు సృష్టించిన రికార్డులు, అవి ఎన్ని రోజులు నడిచాయో నాకు గుర్తులేదు. అభిమానులు మాత్రమే ఆ వివరాలను గుర్తుంచుకుంటారని బాలయ్య బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్బీకే అరుదైన రికార్డును ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే `తాతమ్మ కల` నుంచి ఆయన సినీరంగంలో ఎదిగేందుకు చాలా శ్రమించారని, ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారని తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పేరుతో ఎన్బీకే ధాతృసేవలను, మానవతావాదాన్ని కూడా కొనియాడారు.
