పద్మభూషణ్ తర్వాత NBKలో అదే జోష్
ఈ సంవత్సరం ప్రారంభంలో నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన కృషికి గాను భారతదేశపు అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన `పద్మభూషణ్` లభించింది.
By: Sivaji Kontham | 30 Aug 2025 10:27 PM ISTఈ సంవత్సరం ప్రారంభంలో నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమా రంగానికి చేసిన కృషికి గాను భారతదేశపు అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన `పద్మభూషణ్` లభించింది. ప్రస్తుతం `అఖండ 2: తాండవం` సినిమాతో బిజీగా ఉన్నాడు. తదుపరి దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇంతలోనే ఇప్పుడు యూకే నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.
బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-యూకే గోల్డ్ ఎడిషన్ అధికారికంగా గుర్తించింది. భారతీయ సినీపరిశ్రమలో ఇది ఒక చారిత్రాత్మక క్షణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అరుదైన రికార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడుగా ఎన్బీకే రికార్డులకెక్కారు. ఆయన సాధించిన ఘనతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కుమార్తె నారా బ్రాహ్మణి సహా పలువురు ప్రశంసలు కురిపించారు.
శనివారం సాయంత్రం ట్రైడెంట్ హోటల్ లో సినీరాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో బాలకృష్ణకు ఘన సత్కారం జరుగుతోంది. భారతీయ సినీరంగంలో 50 సంవత్సరాలుగా హీరోగా కొనసాగుతున్న ఏకైక నటుడిగా .. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో ఎన్బీకే పేరు చోటు సంపాదించడంపై సినీరాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. నేటి కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే వేదిక వద్దకు ఎన్బీకే, ఆయన కుమార్తె బ్రాహ్మణి కూడా విచ్చేసారు. రెడ్ కార్పెట్ ఈవెంట్ వీక్షణ కోసం ఎన్బీకే అభిమానులు కూడా భారీగా తరలి రానుండడం ఆసక్తిని కలిగిస్తోంది.
1974లో తాతమ్మ కలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఎన్బీకే ఇప్పటికే 100 పైగా చిత్రాల్లో నటించారు. అన్నదమ్ముల అనుబంధం, భార్గవ రాముడు, సాహసమే జీవితం, కథానాయకుడు, నిప్పులాంటి మనిషి, సమర సింహారెడ్డి, నరసింహానాయుడు, డాకు మహారాజ్, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి వంటి భారీ హిట్ చిత్రాల్లో నటించారు.
