'నరకంలో కాల్చేయాలి'.. ఇప్పుడే నటి వరుస పోస్టులెందుకు?
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణం తర్వాత నటి తనూశ్రీ దత్తా చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
By: M Prashanth | 12 Oct 2026 12:25 PM ISTబాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణం తర్వాత నటి తనూశ్రీ దత్తా చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. తన కెరీర్ నాశనం కావడానికి నానా పటేకర్ కారణమని ఆరోపిస్తూ.. పరోక్షంగా ఆయనను నరకంలో కాల్చేయాలంటూ ఫైర్ అవుతూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అయితే నానా మరణం తర్వాత కూడా పాత విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి నానా పటేకర్, తనూశ్రీ దత్తా మధ్య వివాదం 2008 నుంచే ఉంది. అప్పట్లో వారిద్దరూ హార్న్ ఓకే ప్లీజ్ మూవీకి గాను వర్క్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనతో అనుచితంగా ప్రవర్తించారని తనూశ్రీ ఆరోపించారు. సాంగ్ షూటింగ్ సమయంలో ఆయన ప్రవర్తన తనను ఇబ్బందికి గురిచేసిందని చెప్పారు. అయితే, ఆ ఆరోపణలను నానా పటేకర్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పట్లో మొదలైన ఆ వివాదం కొంతకాలం పాటు కొనసాగింది.
2018లో తనూశ్రీ మరోసారి ఆ విషయాన్ని బయటకు తీసుకురావడంతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అప్పటికే మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడేందుకు ముందుకొస్తున్న మీటూ ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకుింది. ఆ సమయంలో తనూశ్రీ చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో పెద్ద చర్చలు స్టార్ట్ చేశాయి. ఇండస్ట్రీలో మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, తమకు జరిగిన అన్యాయంపై మాట్లాడితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి కూడా డిబేట్ మొదలైంది.
అయితే, తనూశ్రీ ఆరోపణలను నానా పటేకర్ మొదటి నుంచీ కూడా ఖండించారు. ఆ వ్యవహారంపై నమోదైన కేసులో తగిన ఆధారాలు లేవనే కారణంతో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో కొంతకాలం తర్వాత వివాదం వార్తల్లో కనిపించడం తగ్గింది. కానీ తనూశ్రీ మాత్రం తనకు ఎదురైన అనుభవాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. తన కెరీర్ దెబ్బతినడానికి ఆ వివాదమే కారణమని అనేకసార్లు బాధపడ్డారు.
తనకు జరిగిన నష్టాన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు నానా పటేకర్ మరణం తర్వాత ఆమె మరోసారి వరుస పోస్టులతో స్పందిస్తున్నారు. తన జీవితంపై, కెరీర్ పై ఆ వివాదం ఎఫెక్ట్ చూపిందని ఆరోపిస్తూ ఫైర్ అవుతున్నారు. తన వ్యాఖ్యలను తప్పుబడుతున్న వారికి కూడా సోషల్ మీడియా వేదికగా ఆన్సర్స్ చెబుతున్నారు. ఆయన మరణించడంతో గతంలో తనకు ఎదురైన బాధలు తగ్గవని ఆమె అభిప్రాయపడుతున్నట్లు పోస్టుల ద్వారాా తెలుస్తోంది.
అలా నానా పటేకర్ మరణంతో పదేళ్ల కిందటి పాత వివాదం మరోసారి వైరల్ గా మారింది. ఓవైపు ఆయన మృతి పట్ల నివాళులు అర్పిస్తుంటే.. మరోవైపు తనూశ్రీ దత్తా కామెంట్స్ చేస్తుండటంతో ఆ వివాదం చర్చనీయాంశంగా మారింది. గతంలో తనకు జరిగిన అన్యాయంపై న్యాయం దక్కలేదన్న ఫీలింగ్ తో తనూశ్రీ దత్తా వరుస పోస్టులు చేస్తున్నారంటూ అనేక మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
