నానా పటేకర్ ఆఖరి నిమిషాల్లో.. రాత్రి 2:30కి ఆ మెసేజ్
ఆలస్యంగా ఆ మెసేజ్ చూసుకున్న స్నేహితుడు కంగారుగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నానా నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోంది.
By: M Prashanth | 8 Oct 2026 1:54 PM ISTలెజెండరీ యాక్టర్ నానా పటేకర్ మరణవార్త యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. గోవాలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు అన్న వార్తను అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో ఆయన చివరి క్షణాలకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. మణిపాల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ శేఖర్ సాల్కర్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.
నానా పటేకర్ ఆరోగ్యం విషమించడానికి ముందే ఆయనకు తన పరిస్థితిపై కొంత అర్థమైనట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల ప్రాంతంలో తనకు ఏమాత్రం బాగోలేదని ఆయన తన స్నేహితుడికి ఒక మెసేజ్ చేశారు. కానీ ఆ టైమ్ లో నిద్రలో ఉండడం వలన ఆ స్నేహితుడు వెంటనే ఆ మెసేజ్ చూడలేకపోయారు.
ఆలస్యంగా ఆ మెసేజ్ చూసుకున్న స్నేహితుడు కంగారుగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో నానా నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోంది. నానాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయని, ఆయన నెమ్మదిగా స్పృహ కోల్పోవడం గమనించిన ఆ స్నేహితుడు వెంటనే కేర్ టేకర్ కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రి ఎమర్జెన్సీ బృందానికి కాల్ చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ టీమ్ నానా నివాసానికి చేరుకుంది. కానీ అప్పటికే ఆయన శరీరం నుంచి ఎలాంటి స్పందన లేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు అక్కడికక్కడే ఆయనకు కార్డియాక్ మసాజ్ ప్రారంభించారు. ప్రాథమిక చికిత్స అందిస్తూనే అత్యవసర వైద్యం కోసం తెల్లవారుజామున 4:20 నుంచి 4:30 మధ్యలో ఆయన్ను గోవాలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి చేరిన తర్వాత కూడా ఆయనను కాపాడటానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. దాదాపు గంటకు పైగా డాక్టర్ల బృందం తీవ్రంగా శ్రమించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన శరీరం ట్రీట్మెంట్ కు ఏమాత్రం సహకరించకపోవడంతో ఉదయం 5:30 గంటల సమయంలో నానా పటేకర్ తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు.
