నోరు మూసుకో.. నీకేం తెలుసు?
బాలీవుడ్ నట దిగ్గజం నానా పటేకర్ హఠాన్మరణం సినీ లోకాన్ని, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Srikanth Kontham | 9 Oct 2026 3:20 PM ISTబాలీవుడ్ నట దిగ్గజం నానా పటేకర్ హఠాన్మరణం సినీ లోకాన్ని, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదు దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ చిత్రసీమలో విశిష్ట నటనా శైలితో చెరగని ముద్ర వేసిన పటేకర్ మృతి పట్ల భారత్‌లోనే కాకుండా పొరుగుదేశమైన పాకిస్థాన్‌లోనూ ప్రగాఢ సంతాపం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ, నానా పటేకర్ తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నానా పటేకర్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
1994లో ఇద్దరి మధ్య తొలిసారి సంభాషణ ప్రారంభమైందన్నారు. అప్పటి నుంచి తమ మైత్రి కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొన సాగిందని వెల్లడించారు. తాను సరదాగా లతీఫ్ అనే వ్యక్తిని `నానా` అని పిలిచేవాడినని.. ఆ సందర్భంలోనే పటేకర్ తో పరిచయం ఏర్పడిందని బాసిత్ అలీ తెలిపారు. తెరపై కనిపించే నానా పటేకర్ నిజ జీవితంలోనూ అలాగే ఉండేవాడని ఎలాంటి ముసుగు లేని స్వచ్ఛమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి గా కొనియాడారు.
తన కష్టకాలంలో నానా పటేకర్ అందించిన ఆప్యాయత, మానవీయ కోణాన్ని బాసిత్ అలీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో పటేకర్ ప్రతీ వారం ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసేవారన్నారు. తన తల్లితో మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను పంచుకునేవారని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసేవారని తెలిపారు. ఓ రోజు తన తల్లి పరమపదించిన తర్వాత కూడా పటేకర్ ధైర్యం చెబుతూ `బాసిత్ ఇప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో` అని ఓదార్చారని భావోద్వేగంగా వెల్లడించారు.
తన తల్లి విషయమే కాకుండా బాసిత్ అలీ స్వయంగా గుండె సమస్యతో బాధపడి స్టెంట్ వేయించుకున్న సమయంలోనూ నానా పటేకర్ సకాలంలో స్పందించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి రాగానే నానా పటేకర్ నుంచి సందేశం వచ్చిందని.. ఆరోగ్యం కుదుటపడ్డాక ఫోన్ చేయమని కోరారని బాసిత్ తెలిపారు. ఆ తర్వాత మాట్లాడినప్పుడు శస్త్రచికిత్స వివరాలు, ఆరోగ్య పరిస్థితులపై ఎంతో ఆపేక్షతో ఆరా తీశారని తెలిపారు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాల గురించి తాము అడిగినప్పుడు ఆయన సరదాగా `నోరు మూసుకో, నీకేం తెలుసు?` అని పెద్దరికం ఉన్న ప్రేమాభిమానాలతో కోప్పడేవారని స్మరించుకున్నారు.
నానా పటేకర్ మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బాసిత్ అలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు 75 ఏళ్లు అంటే నమ్మబుద్ధి కాదని.. తాను ఎప్పుడూ ఆయన్ని `యంగ్ మ్యాన్` అని పిలిచేవాడినని, దానికి పటేకర్ బదులిస్తూ `అదంతా వదిలేయ్, నువ్వు నేను ఇద్దరం ముసలివాళ్లమయ్యాం` అని నవ్వుతూ అనేవారని చెప్పారు. భారతదేశంతో పాటు పాకిస్థాన్‌లోనూ నానా పటేకర్‌కు అపారమైన అభిమాన గణం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ఇరు దేశాల ప్రజలు ఆయన నటనను, వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడేవారని బాసిత్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మరొక పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కూడా సోషల్ మీడియా వేదికగా నానా పటేకర్‌కు నివాళులర్పించారు. `ఆయన నిర్వర్తించిన పాత్రలు ముగిసినా? ఆయన ప్రభావం రాబోయే తరాల వరకు నిలిచి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
