గుండెపోటుతో ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి నానా పటేకర్ (75) గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు.
By: Sivaji Kontham | 8 Oct 2026 9:23 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి నానా పటేకర్ (75) గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. గోవాలోని నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వార్తతో ఒక్కసారిగా భారతీయ సినీ సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
గోవాలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న నివాసంలో నానా పటేకర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని తక్షణమే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 5:20 గంటల ప్రాంతంలో నానా పటేకర్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు.
ఈ విషాద వార్తను నానా పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్ స్థానిక మీడియాకు స్పష్టం చేశారు. గుండెపోటు కారణంగానే తమ తండ్రి కన్నుమూశారని వెల్లడించారు. దశాబ్దాలుగా విలక్షణ నటనతో మిలియన్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఒక మహానటుడు ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం కుటుంబ సభ్యులను, సన్నిహితులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
నానా పటేకర్ మృతి పట్ల సినీ, రాజకీయ, సామాజిక వర్గాల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. సహ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ వంటి నటుడు మరొకరు లేరని, ఆయన నటనలో ఎవరికీ సాధ్యంకాని ఒక ప్రత్యేక ముద్ర ఉందన్నారు. హీరోగా, విలన్‌గా, కామెడీ నటుడిగా ఆయన చేయలేని పాత్రే లేదని, తెరపైనే కాక రియల్ లైఫ్‌లోనూ సమాజ సేవ చేస్తూ ఆయన రియల్ హీరోగా నిలిచారని గుర్తుచేసుకున్నారు.
నానా పటేకర్ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. `పరిందా`, `క్రాంతివీర్`, `ప్రహార్`, `అబ్ తక్ ఛప్పన్` వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో శభాష్ అనిపించుకున్నారు. నటనకే పరిమితం కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల రైతులకు, గ్రామీణ ప్రజలకు ఆయన చేసిన సామాజిక సేవ ఎనలేనిది.
సినీ ప్రపంచంలో తనదైన నటనతో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన నానా పటేకర్ మరోవైపు తన నిరాడంబరత, మానవత్వంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన హఠాన్మరణం భారతీయ సినిమాకు తీరని లోటని పలువురు ప్రముఖులు కొనియాడారు. అయితే నానా పటేకర్ మృతిపై పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో పోస్టు మార్టం నివేదిక వచ్చిన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
