అందుకే రామాయణ ట్రైలర్ వాయిదా.. సుదీర్ఘ నోట్ పంచుకున్న నిర్మాత!
ఈ హఠాత్తుగా వాయిదా పడటానికి కారణాన్ని వివరించుతూ నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక పెద్ద నోట్ షేర్ చేశారు.
By: Madhu Reddy | 24 July 2026 3:26 PM ISTనాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారతీయ చారిత్రాత్మక చిత్రం ‘రామాయణ’ ట్రైలర్ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. జులై 24న ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రైలర్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ఈ హఠాత్తుగా వాయిదా పడటానికి కారణాన్ని వివరించుతూ నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక పెద్ద నోట్ షేర్ చేశారు.
హాలీవుడ్ దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం:
ట్రైలర్ వాయిదాకు గల ప్రధాన కారణాన్ని నమిత్ మల్హోత్రా స్పష్టం చేస్తూ, హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ తో కుదుర్చుకున్న ఒప్పందమే దీనికి మూలమని వెల్లడించారు. భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు చేర్చాలనేది తన చిరకాల స్వప్నమని, సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో అది నెరవేరబోతోందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాను కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక హాలీవుడ్ స్థాయి మూవీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
గ్లోబల్ రోలౌట్ కోసమే ఆలస్యం:
సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపణీ హక్కులను దక్కించుకోవడంతో, ట్రైలర్ విడుదలను గ్లోబల్ మార్కెటింగ్ ప్రణాళికకు అనుగుణంగా మార్చాల్సి వచ్చిందని నిర్మాత వివరించారు. "ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలు మన సంస్కృతి, కథల గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ఇది బాటలు వేస్తుంది" అని నమిత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఆడియన్స్‌ను ఒకేసారి చేరుకోవాలనే ప్లాన్‌తో, ట్రైలర్‌ను త్వరలో కొత్త తేదీలో రిలీజ్ చేస్తామని వారు స్పష్టం చేశారు.
స్టార్ కాస్ట్.. అంచనాల పర్వం:
నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యష్ రావణాసురుడిగా కనిపించనున్నారు. వీరితో పాటు సన్నీ డియోల్ (హనుమంతుడు), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ), కాజల్ అగర్వాల్ (మండోదరి) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరాయి.
త్వరలోనే అధికారికంగా కొత్త తేదీ:
ఆఖరి నిమిషంలో ట్రైలర్ వాయిదా పడటం వల్ల అభిమానులకు కొంత నిరాశ ఎదురైనప్పటికీ, గ్లోబల్ ప్రమోషన్స్ కోసం తీసుకున్న ఈ నిర్ణయం సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని, నవంబర్ 8 నాటికి ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని సమాచారం. త్వరలోనే రాబోయే ఆఫీషియల్ ట్రైలర్ డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
