ఆస్తి తణఖా పెట్టిన నిర్మాత 25 ఏళ్లకే రూ. 9000 కోట్ల సంపద సృష్టి.. 4000 కోట్ల బడ్జెట్‌తో సినిమా!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న`రామాయణం` చిత్రం వెనుక ఉన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.
By: Sivaji Kontham | 1 Aug 2026 2:53 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న`రామాయణం` చిత్రం వెనుక ఉన్న నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయాణం ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది. ప్రస్తుతం రూ. 9,204 కోట్లకు పైగా నికర ఆస్తిపరుడిగా నిలిచిన అతడు సాధారణ హాలీవుడ్ కమర్షియల్ చిత్రాలను నిర్మించే అవకాశం ఉన్నా.. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయి విజువల్ వండర్‌గా ఆవిష్కరించేందుకు పూనుకున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ (రాముడు), యశ్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.
నమిత్ మల్హోత్రా ప్రయాణం ఒక గ్యారేజ్ నుంచి ప్రారంభమైంది. తన 21వ ఏట కనీసం ఎలాంటి పెట్టుబడిదారులు లేదా ఫైనాన్షియర్ల మద్దతు కూడా లేని రోజుల్లో హై-ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్ సిస్టమ్ కొనుగోలు చేయడానికి రూ. 2 కోట్ల రుణం కోసం ముంబైలోని తమ సొంత ఇంటినే బ్యాంక్‌లో తాకట్టు పెట్టారు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద రిస్క్ అదేనని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత అతడు స్థాపించిన `వీడియో వర్క్‌షాప్`, తండ్రి సంస్థతో కలిసి `ప్రైమ్ ఫోకస్`గా రూపాంతరం చెందింది. లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ వంటి నగరాలకు విస్తరించి 2006లో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే స్థాయికి ఎదిగింది.
అయితే 2008 గ్లోబల్ ఆర్థిక మాంద్యం (లెహ్‌మాన్ బ్రదర్స్ సంక్షోభం) నమిత్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. విదేశీ బాండ్ల ద్వారా చేసిన అప్పులు, స్టాక్ మార్కెట్ క్రాష్ వల్ల ఆయన దాదాపు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితికి వచ్చారు. అంతటి తీవ్ర సంక్షోభంలోనూ ధైర్యం వీడకుండా.. అప్పులను రివ్యూ చేసుకుని విడిపోయిన ఏడు కంపెనీలను ఒక్కటిగా చేసి విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), 3డి కన్వర్షన్‌పై దృష్టి పెట్టారు. ఆపై 2014లో ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ చిత్రాలకు ఆస్కార్ సాధించిన లండన్ వీఎఫ్ఎక్స్ స్టూడియో `డబుల్ నెగటివ్`ను విలీనం చేసుకుని DNEG అనే గ్లోబల్ బ్రాండ్‌ను సృష్టించారు.
భారత ఆర్థిక రాజధాని ముంబైకి చెందిన నమిత్ ఒక చిన్న గ్యారేజీలో కెరీర్‌ని ప్రారంభించి ఈరోజు దాదాపు 9వేల మందికి ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించిన వీఎఫ్ఎక్స్ సంస్థకు అధినేతగా ఎదిగారు. బ్లేడ్ రన్నర్ 2049, టెనెట్, డ్యూన్, ఓపెన్‌హైమర్ వంటి బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించి వరుసగా పలు ఆస్కార్ అవార్డులను డి.ఎన్.ఇ.జి గెలుచుకుంది. ఈ స్థాయి విజయాన్ని సాధించిన నమిత్ మల్హోత్రా.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద సాహసానికి శ్రీకారం చుట్టారు. భారతీయ కథను `అవతార్`, `అవేంజర్స్` స్థాయిలో ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే లక్ష్యంతో `రామాయణం` ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
ఈ రెండు భాగాల `రామాయణం` నిర్మాణానికి.... విజువల్ ఎఫెక్ట్స్‌కి.. సాంకేతికతకి.. ప్రపంచవ్యాప్త ప్రచారానికి కలిపి దాదాపు 500 మిలియన్ డాలర్లు (రూ. 4,000 కోట్లకు పైగా) బడ్జెట్ కానుందని అతడు స్పష్టం చేశారు. ఇతరుల పెట్టుబడులు లేకుండా ఈ భారీ బడ్జెట్‌ను స్వీయ ఆర్జిత నిధుల నుంచే సమకూర్చానని నమిత్ తెలిపారు. కేవలం ముంబైలో ఇల్లు తాకట్టు పెట్టిన ఒక సాధారణ యువకుడి నుంచి... ఆస్కార్ విన్నర్ టెక్నాలజీతో రూ. 4,000 కోట్ల బడ్జెట్ తో `రామాయణ` ఫ్రాంఛైజీని నిర్మించే స్థాయికి ఎదిగిన నమిత్ మల్హోత్రా ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంగా నిలిచింది. పాతికేళ్లలోనే ఆయన ఈ ఘనతను సాధించడం కూడా గమనించదగినది.
