జీరో టు ఆస్కార్... 'రామాయణ' నిర్మాత షాకింగ్ లైఫ్ హిస్టరీ
బ్రహ్మాస్త్రకు సైతం నమిత్ మల్హోత్ర నిర్మాతగా ఉన్నప్పటికీ రామాయణ నిర్మాతగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
By: Ramesh Palla | 30 Oct 2026 8:00 AM ISTప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'రామాయణ'. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాను తీస్తే విజువల్ వండర్‌గా, అద్భుతం కళ్ల ముందు ఆవిస్కారం అయినట్లుగా అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు. హాలీవుడ్ సినిమాలకే పరిమితం అయిన ఈ బడ్జెట్‌ను ఇండియన్ సినిమాలకు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. నితేష్ తివారీ పై నమ్మకం, రామాయణంపై ఉన్న భక్తితో ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ అధినేత అయిన నమిత్ మల్హోత్ర ఈ సినిమాను ఏకంగా నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది. సాధారణంగానే రామాయణం పై సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ అంచనాలు పది రెట్లు పెంచే విధంగా నమిత్ మల్హోత్ర భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మించాడు.
రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్ర...
బ్రహ్మాస్త్రకు సైతం నమిత్ మల్హోత్ర నిర్మాతగా ఉన్నప్పటికీ రామాయణ నిర్మాతగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రామాయణ సినిమాను ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన కారణంగా ఆయన గురించి ఇప్పుడు ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఎవరు ఈ నమిత్ మల్హోత్ర, ఎందుకు ఇంత డబ్బును రామాయణ సినిమాపై ఖర్చు పెట్టారు అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నమిత్ మల్హోత్ర పుట్టుకతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంకు అధిపతిగా పుట్టలేదు, చిన్న షెడ్ లో ఒక వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ప్రారంభించి, కష్టపడి, ఆ కంపెనీని అద్భుతంగా తీర్చి దిద్ది, వీఎఫ్‌ఎక్స్ అంటే ఇండియన్ సినిమాలకు పరిచయం చేసింది నమిత్ మల్హోత్ర వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ప్రైమ్ ఫోకస్. చాలా తక్కువ సమయంలోనే హాలీవుడ్ సినిమాలకు సైతం వర్క్ చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును ప్రైమ్ ఫోకస్ దక్కించుకుంది.
ప్రైమ్ ఫోకస్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ...
2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నమిత్ మల్హోత్ర అప్పటి వరకు కష్టపడి సంపాదించిన వ్యాపార సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది. ఆ సమయంలో నమిత్ మల్హోత్ర సంపదలో దాదాపుగా 90 శాతం కోల్పోయాడు. అయినా నమిత్ పట్టు వదల్లేదు. పోయిన చోట వెతుక్కుంటూ మళ్లీ జర్నీ ప్రారంభించాడు. సినిమా రంగంపై ఉన్న నమ్మకంతో వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా ఆయన జర్నీ అద్భుతమైన టర్న్ తీసుకుంది. నమిత్ ప్రారంభించిన వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, వేల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసింది. దాంతో ప్రపంచ వీఎఫ్‌ఎక్స్ దిగ్గజం అయిన డబుల్ నెగిటివ్ కంపెనీలో 2014లో విలీనం అయింది. లండన్ కు చెందిన డబుల్ నెగిటివ్ కంపెనీలో ప్రైమ్ ఫోకస్ విలీనం కావడంతో నమిత్ సంపద దాదాపుగా రెట్టింపు అయింది.
డబుల్ నెగటివ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ...
డబుల్ నెగటివ్ సంస్థలో నమిత్ మల్హోత్రకు పెద్ద మొత్తంలో వాటా ఉండటంతో ఆయన ఎన్నో హాలీవుడ్ సినిమాల వీఎఫ్‌ఎక్స్ వెనుక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు డబుల్ నెగిటివ్ వీఎఫ్‌ఎక్స్ అందించి ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. నమిత్ మల్హోత్ర సారధ్యంలో నడుస్తున్న డబుల్ నెగిటివ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 8 ఆస్కార్ అవార్డ్‌లను సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఏమీ లేని నమిత్ మల్హోత్ర ఇప్పుడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ను నెలకొల్పాడు. సినిమాల వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్ పై ఆసక్తితో ఒక చిన్న కంప్యూటర్ లో మొదలు పెట్టిన ఆయన జర్నీ ఇప్పుడు ఇండియన్ మూవీస్ నుంచి హాలీవుడ్ సినిమాలు, ఆస్కార్ వరకు సాగింది. జీరో నుంచి మొదలు పెట్టిన నమిత్ మల్హోత్రకు రామాయణ సినిమా ఎంత తెచ్చి పెడుతుంది, ఏం సంపాదిస్తుంది అనే విషయం పక్కన పెడితే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమాతో ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
