నోలాన్ మేకింగ్ స్టైల్‌లో 'రామాయణం'?
రామాయణం, మహాభారతం వంటి పురాణేతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Sivaji Kontham | 23 Aug 2025 1:23 PM ISTరామాయణం, మహాభారతం వంటి పురాణేతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి నేర్పించిన ఇతిహాసాలు ఇవి. అందుకే రామాయణ, మహాభారత కథలను సినిమాగా తీస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ ఉంటుంది. ఇండియన్ సినిమా హాలీవుడ్ ని తలదన్నే దిశగా దూసుకెళుతున్న ఈ రోజుల్లో మన పురాణేతిహాసాలను తెరపై విజువల్ బ్రిలియన్సీతో, నేటి అధునాతన సాంకేతికతతో చూపించాలనే ప్రయత్నం మెచ్చదగినది. అలాంటి గొప్ప ప్రయత్నం చేస్తున్నారు రాకింగ్ స్టార్ యష్- నమిత్ మల్హోత్రా- నితీష్ తివారీ బృందం.
దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా 'రామాయణం' తెరకెక్కనుందని చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఆసక్తికరంగా ఈ సినిమాని భారతదేశంతో పాటు, చైనా, జపాన్ సహా పాశ్చాత్య దేశాల్లో విడుదల చేయాలనే లక్ష్యంతోనే ఇంత భారీ బడ్జెట్‌ని కేటాయిస్తున్నారని తెలుస్తోంది. రామాయణం ఫ్రాంఛైజీని హాలీవుడ్ కి ధీటుగా తెరకెక్కించాలని తివారీ - నమిత్ బృందం తలపోస్తోంది. మేకింగ్ పరంగాను బెంచ్ మార్క్ సెట్ చేయాలనే తపన టీమ్ లో కనిపిస్తోంది.
హాలీవుడ్ ఫిలింమేకర్స్ శైలికి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అవతార్, గ్లాడియేటర్ తరహాలో అధునాతన సాంకేతికతతో ఆశ్చర్యపరిచే విజువల్స్ ని రామాయణంలో చూపించాలనే తపన మేకర్స్ లో ఉంది. అంతేకాదు.. స్క్రీన్ ప్లే పరంగా, టెక్నిక్ పరంగా క్రిస్టోఫర్ నోలాన్ రేంజ్ విజువల్స్ ని చూపించాలనే ప్రయత్నం కూడా 'రామాయణం' టీమ్‌లో కనిపిస్తోంది.
''ప్రపంచ శాంతి కోసం రామాయణం.. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా చూడదగ్గ సినిమా!'' అని నమిత్ అన్నారు. పాశ్చాత్యులు ఈ సినిమాని ఇష్టపడతారని ఆశిస్తున్నట్టు తెలిపారు. వెస్ట్ నుంచి భారీ వసూళ్లు తెస్తామన్నారు. రామాయణం నమ్మకం, అపనమ్మకం అనే సరిహద్దులను అన్నిచోట్లా చెరిపేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ''పాశ్చాత్య దేశాల ప్రజలు మా సినిమాను ఇష్టపడకపోతే, నేను దానిని వైఫల్యంగా భావిస్తాను. మీకు ఇది నచ్చకపోతే, నాకు సిగ్గుచేటు.. మేం ఇంకా బాగా చేసి ఉండాల్సిందని భావిస్తాను'' అని నమిత్ అన్నారు. నిర్మాత సహా చిత్రబృందం కాన్ఫిడెన్స్ చూస్తుంటే, దీనిని 300- గ్లాడియేటర్ రేంజ్ విజువల్స్ తో ఊహించుకోవచ్చు.
