ఖాన్‌లకు పోటీగా నిలిచి.. అకస్మాత్తుగా మాయమైన నటుడి కథ
బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ప్రతిరోజూ ఎంతోమంది నూతన నటీనటులు ఎన్నో కలలతో అడుగు పెడుతుంటారు.
By: Srikanth Kontham | 22 Jun 2026 3:00 PM ISTబాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ప్రతిరోజూ ఎంతోమంది నూతన నటీనటులు ఎన్నో కలలతో అడుగు పెడుతుంటారు. ఒక్క భారీ విజయం జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుందని నమ్ముతారు. సరిగ్గా 1990ల చివరలో.. 2000ల ప్రారంభంలో బాలీవుడ్ ఓ విలక్షణమైన మార్పును ఎదుర్కొంటున్న తరుణంలో ఓ యువ నటుడికి అలాంటి అద్భుతమైన అవకాశమే దక్కింది. సీనియర్ నటులంతా క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమవుతున్నారు. పరిశ్రమ కొత్త ముఖాల కోసం వెతుకుతున్న ఆ రోజుల్లో ఒకే ఒక్క చిత్రంతో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న ఆ నటుడే నకుల్ కపూర్.
నకుల్ కపూర్ సినీ ప్రయాణం వెండితెరపై ప్రారంభం కాలేదు. అంతకంటే ముందే 1998లో వచ్చిన `హో గయీ హై మొహబ్బత్ తుమ్సే` అనే మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఆల్బమ్ సాధించిన విజయంతో నకుల్ కు వెండితెర అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే 2002లో దీపక్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన `తుంసే అచ్చా కాన్ హై` చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆర్తీ ఛాబ్రియా, కిమ్ శర్మ హీరోయిన్లుగా నటించిన మ్యూజికల్ లవ్ ట్రయాంగిల్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. నకుల్ అమాయకత్వం, లవర్ బాయ్ ఇమేజ్ 90ల నాటి యువతకు క్రష్‌గా మార్చేసింది.
ఆ సమయంలో బాలీవుడ్ పరిశ్రమను శాసిస్తున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి అగ్ర హీరోల త్రయానికి గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉన్న ఏకైక సరికొత్త స్టార్‌గా నకుల్ కపూర్ ను ప్రేక్షకులు భావించారు. ఆయన నటించిన చిత్రంలోని పాటలు అప్పట్లో వన్-సైడ్ లవర్స్‌కు, ప్రేమలో విఫలమైన వారికి గీతంగా మారిపోయాయి. అదే రోజు విడుదలైన గోవిందా, రాణీ ముఖర్జీల `ప్యార్ దీవానా హోతా హై` వంటి స్టార్ సినిమా కూడా ఈ చిత్రం క్రియేట్ చేసిన మ్యూజికల్ వేవ్ ముందు నిలబడలేకపోయింది. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడి కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుందని అంతా అంచనా వేశారు.
కానీ అనూహ్యంగా నకుల్ కపూర్ సినీ ఇండస్ట్రీ నుండి అకస్మాత్తుగా మాయమైపోయారు. గ్లామర్, కీర్తి ప్రతిష్టలు, లైమ్‌లైట్ ఉన్నా? వినోద ప్రపంచాన్ని వదిలి ఆయన తీసుకున్న నిర్ణయం అభిమానులను, చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చేతినిండా అవకాశాలు వచ్చే తరుణంలో స్టార్‌డమ్ శిఖరాగ్రంలో ఉండగా ఒక నటుడు ఇలా పూర్తిగా కనిపించకుండా పోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఎవరికీ అర్థం కాలేదు. తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి ఎలాంటి ప్రకటనలు లేకపోవడంతో నకుల్ కపూర్ ఉనికి ఒక పెద్ద మిస్టరీగా మారింది.
నకుల్ కపూర్ సుదీర్ఘకాలం పాటు పరిశ్రమకు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆయనపై రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఆయన ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మరణించారని కొందరు.. ప్రాణాంతక వ్యాధి బారిన పడి కన్నుమూశారని మరికొందరు వార్తలను సృష్టించారు. ఈ ఊహాగానాలు ఏ స్థాయికి చేరాయంటే? ఒకానొక దశలో పరిశ్రమ కూడా ఆయన ఇక లేరనే నమ్మింది. అయితే 2015లో నకుల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చారు. తాను బతికే ఉన్నానని.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేయడంతో పుకార్లకు తెరపడింది.
ప్రస్తుతం నకుల్ కపూర్ కెనడాలోని వాంకోవర్ నగరంలో స్థిరపడ్డారు. గ్లామర్ ప్రపంచానికి పూర్తి భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆయన `డివైన్ లైట్ యోగా` అనే వెల్‌నెస్ -యోగా కేంద్రాన్ని నడుపుతున్నారు. అలా యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. భార్యాపిల్లల వివరాలను కూడా ఎక్కడా వెల్లడించకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచుతున్నారు.
