Begin typing your search above and press return to search.

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నగ్మా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తండ్రి హిందువు, తల్లి ముస్లిం కావడంతో చిన్నప్పటి నుంచి భిన్న మతాల సంస్కృతిలో పెరిగానని, 2007లో బాప్టిజం తీసుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించానని తెలిపారు. గంగూలీతో ప్రేమాయణం వార్తల్లో నిలిచినా, 50 ఏళ్లు దాటినా ఆమె పెళ్లి చేసుకోలేదు.

By:  Madhu Reddy   |   5 Nov 2026 12:21 PM IST
నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!
X

ఒకప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు ఏకధాటిగా ఏలిన స్టార్ హీరోయిన్ నగ్మా తన వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో రకాల హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె, జీవితంలో ఎదురైన ఒడుదొడుకులు, లవ్ ఎఫైర్లు మరియు తన కుటుంబంలో ఉన్న మూడు ప్రధాన మతాల సంస్కృతి గురించి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన విశేషాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

తండ్రి హిందూ.. తల్లి ముస్లిం:

నగ్మా కుటుంబ నేపథ్యం ఎంతో విభిన్నమైనది. ఆమె తండ్రి అరవింద్ ప్రతాప్‌సింగ్ మొరార్జీ రాజస్థానీ నేపథ్యం ఉన్న హిందూ వ్యాపారవేత్త కాగా, తల్లి సీమా (షామ కాజీ) ముస్లిం కుటుంబానికి చెందినవారు. తల్లి కుటుంబానికి స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం ఉంది. ఇక డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున జన్మించిన నగ్మా, కాన్వెంట్ పాఠశాలలో చదవడం వల్ల చిన్నప్పటి నుంచే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పెరిగానని గతంలో స్పష్టం చేశారు.

2007లో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి:

ఇంట్లో హిందూ, ముస్లిం సంస్కృతులు ఉన్నప్పటికీ, నగ్మా చిన్నతనం నుంచే ఏసుక్రీస్తు సిద్ధాంతాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే 2007లో ఆమె అధికారికంగా బాప్టిజం తీసుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇలా ఒకే కుటుంబంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఒకే చోట ఉండటం విశేషం. ఇక నగ్మా సవతి సోదరీమణులైన జ్యోతిక, రోషిణిల తండ్రి చందర్ సదనా పంజాబీ హిందూ కావడం గమనార్హం.

లవ్ ఎఫైర్లు.. పెళ్లి దాకా రాని ప్రయాణం:

నగ్మా సినీ కెరీర్ ఎంత సక్సెస్ అయిందో, ఆమె పర్సనల్ లైఫ్ కూడా అంతే సంచలనంగా మారింది. అప్పట్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఆమె నడిపిన డేటింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. ఇక వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గుడిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చినా, అది రూమర్స్ గానే మిగిలిపోయాయి.. 50 ఏళ్లు దాటినా ఆమె వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉండిపోయారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. కాంగ్రెస్ కీలక నేతగా:

2008లో నటనా రంగానికి స్వస్తి చెప్పిన నగ్మా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సమాజంలో జరిగే మతపరమైన ఘర్షణలు తన్ను తీవ్రంగా కలిచివేశాయని, అందుకే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. ఇక 2015లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆమె ప్రస్తుతం లో-ప్రొఫైల్‌లో ఉంటూ పొలిటికల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

ఇక మొత్తానికి చూస్తే, 10 భాషల్లో 90కి పైగా సినిమాలతో మెప్పించిన నగ్మా జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఇక కుటుంబంలో మూడు మతాల కలయికతో లౌకిక భావాలు పెంపొందించుకుని, సినిమాల నుంచి రాజకీయాల వరకు తన మార్కు చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.