ఖర్చు విషయంలో రాజమౌళికి తగ్గట్టుగానే..
ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఫుల్ జోష్‌తో సాగింది.
By: M Prashanth | 29 Sept 2026 10:36 PM ISTఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఫుల్ జోష్‌తో సాగింది. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేదికపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పీచ్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. స్టేజ్ ఎక్కగానే తనదైన శైలిలో మాట్లాడిన నాగవంశీ, రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ ఖర్చుల మీద సరదాగా వేసిన పంచులు ఆడియన్స్‌తో పాటు వేదికపై ఉన్న వాళ్లని కూడా నవ్వించాయి.
సాధారణంగా ఈవెంట్లలో మైక్ పట్టుకుంటే ఏదో మొక్కుబడిగా శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోతుంటారు. కానీ నాగవంశీ మాత్రం కార్తికేయను నేరుగా టార్గెట్ చేస్తూ సెటైర్ వేశారు. కార్తికేయ ఫుల్ లెంగ్త్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్న మొదటి సినిమా ఇదని ఇందాకే డైరెక్టర్ శశాంక్ చెబితే తెలిసిందంటూ మొదలుపెట్టారు. ఆ వెంటనే, కార్తికేయ కూడా వాళ్ల డాడీ రాజమౌళి లాగే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 50 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీశాడని రోజూ అందరూ చెబుతున్నారని సరదాగా కౌంటర్ వేశారు.
ఈ మాటకు కింద కూర్చున్న రాజమౌళి, కార్తికేయ ఇద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. జక్కన్న కాంపౌండ్ అంటేనే క్వాలిటీ కోసం బడ్జెట్ హద్దులు దాటేయడం సహజం. మరి ఆ లక్షణం కార్తికేయకు కూడా రక్తంలోనే వచ్చిందన్నట్టుగా నాగవంశీ వేసిన ఈ పంచ్ భలే పేలింది. చిన్న సినిమాగా మొదలైనా విజువల్స్, టెక్నికల్ వేల్యూస్ కోసం కార్తికేయ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ కుమ్మరించాడనే టాక్‌కు ఈ కామెంట్ నిజమైంది.
సరదా పంచుల సంగతి పక్కన పెడితే, కార్తికేయ వ్యక్తిత్వం గురించి నాగవంశీ చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి. టాలీవుడ్‌లో ఏ బ్యానర్‌లో సినిమా హిట్ అయినా, ఆ ప్రొడ్యూసర్‌కు లేదా డైరెక్టర్‌కు ఫస్ట్ మెసేజ్ చేసి, ట్వీట్ వేసి అభినందించే వ్యక్తి కార్తికేయ అని కొనియాడారు. ఇండస్ట్రీలో అందరి సక్సెస్‌ను మనస్ఫూర్తిగా కోరుకునే ఇలాంటి మంచి మనసున్న వ్యక్తికి నిర్మాతగా భారీ విజయం దక్కాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ క్రమంలోనే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ పెద్ద హిట్ అయి, కార్తికేయకు భారీగా డబ్బులు రావాలని, ఆ లాభాలతో టాలీవుడ్ కోసం ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించాలని నాగవంశీ కోరుకున్నారు. కాలభైరవ చెప్పినట్టు అక్టోబర్ 2న ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయాలని పిలుపునిచ్చారు. చివరిగా తారక్ ఫ్యాన్స్ జోష్ మధ్య "జై ఎన్టీఆర్" అంటూ తన స్పీచ్ ముగించారు. నాగవంశీ ఇచ్చిన ఈ బోల్డ్, ఫన్నీ స్పీచ్ DTTT ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. కార్తికేయ పెట్టిన భారీ ఖర్చుకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద నిజంగానే కాసుల వర్షం కురుస్తుందా అనేది చూడాలి. రాజమౌళి బ్రాండ్‌తో వస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది.
