నాగవంశీ పోస్టులో తప్పేముంది? సుబ్రహ్మణ్యుడి అసలు కథేంటి?
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న మైథలాజికల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 1 July 2026 12:17 PM ISTజూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న మైథలాజికల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా అనౌన్స్మెంట్ కంటే ఎక్కువగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్. సినిమాపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను షేర్ చేస్తూ నాగవంశీ.. "ఉత్తరాన జన్మించాడు.. దేశ హృదయభాగంలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాన పూజలందుకుంటున్నాడు" అనే ఫీలింగ్ తో క్యాప్షన్ ఇచ్చారు. ఇందులోని ఉత్తరాన జన్మించాడన్నది వివాదానికి కారణమైంది. తమిళ నెటిజన్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా నాగవంశీ పోస్టులో తప్పుందా? అంటే దీనికి సమాధానం పురాణాలు, తమిళ కల్చర్ చెప్పే కథలు చూస్తే తెలుస్తుంది.
పురాణాలైన శివపురాణం, మహాభారతం ప్రకారం, కార్తికేయుడు హిమాలయాల్లో పుట్టి, తర్వాత దేవసేనాధిపతిగా నిలిచాడు. దాని ఆధారంగా చూస్తే ఉత్తరాన జన్మించాడనే క్యాప్షన్ కు పురాణం ప్రకారం ప్రూఫ్ ఉందని కొందరు చెబుతున్నారు. అందుకే నాగవంశీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని తెలుగు ప్రేక్షకులు, పురాణాలు ఆధారంగా చూపుతున్నవారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తమిళ సంప్రదాయంలో మాత్రం మురుగన్ కు ప్రత్యేక స్థానం ఉంది.
ఆయనను తమిళ్ లాంగ్వేజ్, కల్చర్, ట్రెడిషన్ కు సింబల్ గా భావిస్తారు. మురుగన్ తమిళుల స్థానిక దేవుడని, ఆయనను నార్త్ కు చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నం చేయడం సరైంది కాదని తమిళ నెటిజన్లు విమర్శిస్తున్నారు. వాస్తవానికి కార్తికేయుడు, మురుగన్ గురించి రెండు సంప్రదాయాల్లో రెండు భిన్నమైన కథనాలు ఉన్నాయి. పురాణాల్లో ఆయన స్కందుడు, కార్తికేయుడిగా కనిపిస్తే.. తమిళ సంప్రదాయంలో మాత్రం మురుగన్ స్థానిక దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మెల్లగా ఆ రెండు సంప్రదాయాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయని కొందరు చెబుతున్నారు.
అయితే ఆ అంశాన్ని రీజనల్ ఎమోషన్స్ తో లింక్ చేసినప్పుడు మాత్రం ఇలాంటి వివాదాలు తలెత్తడం కొత్త విషయం కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా కేవలం క్యాప్షన్ పై మాత్రమే కాదు. నార్త్- సౌత్ కల్చర్స్, లోకల్ ట్రెడిషన్స్ చుట్టూ తిరుగుతున్న వాదనగా మారింది. దీంతో సినిమా ప్రకటన కంటే వివాదమే ఎక్కువగా వైరల్ అవుతోంది. అదే సమయంలో మరో అభిప్రాయం వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు విడుదలకు ముందే చర్చకు రావడం సహజమని, నాగవంశీ పోస్ట్ కూడా అలాంటి హైప్ తీసుకొచ్చిందని అంటున్నారు.
వివాదం వల్ల సినిమా మరింత వేగంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. అదే సమయంలో దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో మరింత జాగ్రత్త అవసరమని సినీ ప్రియులు సూచిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు నాగవంశీ పోస్ట్ ఉద్దేశం ఏదైనా.. అది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇక త్రివిక్రమ్ కథను ఎలా నడిపిస్తారు? సినిమాలో మురుగన్, కార్తికేయుని కథను ఏ యాంగిల్ లో చూపిస్తారు? అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత వివాదానికి చెక్ పడనుంది.
