సినిమా టికెట్ ధర పెరగడానికి బడ్జెట్టే కారణమా?
పెద్ద సినిమాల రిలీజ్ ల సమయంలో టికెట్ ధరల్ని ఇష్టానుసారం పెంచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.
By: Sivaji Kontham | 29 Dec 2025 6:21 PM ISTపెద్ద సినిమాల రిలీజ్ ల సమయంలో టికెట్ ధరల్ని ఇష్టానుసారం పెంచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పెద్ద నిర్మాతలు ధనార్జనే ధ్యేయంగా, మొదటి మూడు రోజుల్లో ప్రజల నుంచి డబ్బు పిండుకునే ఏర్పాట్లు చేసుకున్నారని, దీనికోసం అదుపు తప్పి టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నారని, దీనికి ప్రభుత్వాలు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నాయని కమ్యూనిస్టులు, కమ్యూనిజం భావజాలాలు ఉన్న కొందరు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. టికెట్ ధరలు అదుపులో లేకపోవడం వల్ల ఇండస్ట్రీ పెద్దలు మారకపోవడం వల్లనే ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని, అతడు చేసినది తప్పు అయినా, దానికి పరిష్కారం కనుగొనాల్సినది పరిశ్రమ మాత్రమే, ఇక్కడ విధానాలు మారాలని కూడా సూచించారు.
అయితే పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ ధరల్ని పెంచుతున్నారని, 400-500 కోట్ల రేంజులో బడ్జెట్లు పెడుతున్నారని, పెరిగిన బడ్జెట్ ని రికవరీ చేయడం కోసం టికెట్ ధరలు పెంచాల్సి వస్తోందని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇటీవల ఫిలింఛాంబర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాగవంశీ తాజాగా టికెట్ ధరలపై స్పందించడం ఆసక్తిని కలిగించింది. టికెట్ ధరలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ధరల్ని పెంచి జనాలను థియేటర్లకు రానివ్వకుండా చేస్తున్నారనడం సరికాదని నాగవంశీ అన్నారు. పెద్ద సినిమా బడ్జెట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరల్ని పెంచాల్సి వస్తోందని అన్నారు. చిన్న సినిమాలకు రూ.100 టికెట్ ధర నిర్ణయించినా అవి రికవరీ కాగలవని కూడా వ్యాఖ్యానించారు. పెద్ద సినిమాలకు ఇదే ధర నిర్ణయిస్తే సంవత్సరం ఆడినా కానీ రికవరీ అవ్వడం కష్టమని నాగవంశీ అన్నారు. మేం బతికేదే ఇండస్ట్రీపై ఆధారపడి.. అలాంటిది జనాలను దోచేయాలని ఎవరూ అనుకోరు. బడ్జెట్ల కారణంగానే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
అలాగే ఏదైనా సినిమాని హిట్ చేయాలా లేదా? అనేది జనం చేతిలోనే ఉంది. తొక్కేయాలని ఎవరూ అనుకోరు అని కూడా వ్యాఖ్యానించారు. `లిటిల్ హార్ట్స్` చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించడానికి కారణం ప్రజాదరణేనని అన్నారు. సానుభూతి ప్రచారాల వల్ల కూడా సినిమా హిట్టవుతుందని గ్యారెంటీ ఇవ్వలేమని, ఈరోజుల్లో ప్రజలు వేరేగా ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు.
హీరోలే ఒత్తిడి పెంచుతున్నారా?!
నిజానికి అగ్ర హీరోలతో సినిమాలు తీయాలంటే ఒక్కో హీరోకి 100 కోట్లు అదనంగా లాభాల్లో వాటాలు చెల్లించుకోవాల్సి ఉంటుందని మీడియాలో కథనాలొచ్చాయి. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్, భారీ స్టార్ కాస్టింగ్ కారణంగా బడ్జెట్లు అదుపు తప్పుతున్నాయని, పెరిగిన ఖర్చు వెనక పారితోషికాల భారం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు. హీరో సామ్యం కారణంగా నిర్మాతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కథనాలొచ్చాయి. టికెట్ ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని నమ్ముతున్నారు.
