నాగవంశీ కొత్త నిర్ణయం.. దిల్ రాజు బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతుందా?
టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరు.
By: M Prashanth | 3 Feb 2026 9:51 PM ISTటాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై స్టార్ హీరోలతో పాటు విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మిస్తూ అత్యంత యాక్టివ్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి ఏడాది ఆయన నుంచి అనేక మూవీలు.. ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో నాగవంశీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.
అయితే తాజాగా ఆయన తీసుకుంటున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు నాగవంశీ నిర్మించిన సినిమాల మెజారిటీ నైజాం ప్రాంతంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ద్వారానే విడుదలయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఆ కాంబినేషన్ చాలా కాలంగా కొనసాగుతోంది. నాగవంశీ సినిమాలు దిల్ రాజు చేతుల్లోకి వెళ్తే మార్కెట్ లో మంచి రికవరీ ఉంటుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది.
కానీ తాజా సమాచారం ప్రకారం నాగవంశీ ఇకపై కొత్త డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి పని చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇది దిల్ రాజుకు ఊహించని షాక్ గా మారే అవకాశముంది. ఎందుకంటే నాగవంశీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు సాధారణంగా మంచి బిజినెస్ చేసే ప్రాజెక్టులే.
స్టార్ హీరోల సినిమాలు, యూత్ ఎంటర్‌టైనర్లు, ఫ్యామిలీ డ్రామాలు.. ఇలా విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ మార్కెట్ లో స్థిరమైన స్థానం సంపాదించారు. అలాంటి నిర్మాత సినిమాలు వేరే డిస్ట్రిబ్యూటర్ చేతికి వెళ్లడం అంటే దిల్ రాజు నిజాం మార్కెట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దిల్ రాజు చాలా కాలంగా నైజాం ప్రాంతంలో బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఏర్పరుచుకున్నారు.
పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అనేక చిత్రాలను విజయవంతంగా విడుదల చేసి ట్రేడ్ లో తనదైన స్థానం సంపాదించారు. అయితే ఇటీవల నిర్మాతగా ఆయనకు పెద్ద విజయాలు రాకపోవడం గమనార్హం. వరుస ఫ్లాప్స్ తర్వాత మళ్లీ బలమైన కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నాగవంశీ సినిమాలు దూరమవడం ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారొచ్చని నెటిజన్లు అంటున్నారు.
అయితే నాగవంశీ నిర్ణయం వెనుక అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పూర్తిగా వ్యాపార పరమైన లెక్కలేనా? లేక విస్తరణలో భాగమా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు దిల్ రాజు చర్చలు జరిపి ఆ భాగస్వామ్యాన్ని మళ్లీ కొనసాగించే ప్రయత్నం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నాగవంశీ నిర్ణయం.. నైజాం డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కొత్త చర్చలకు దారి తీసింది. రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం ఎలాంటి మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.
