2026: సితార నుంచి నెలకో సినిమా
టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్లలో నాగవంశీ ముందుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడ్డారు.
By: M Prashanth | 1 Dec 2025 11:05 PM ISTటాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్లలో నాగవంశీ ముందుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడ్డారు. వరుస ప్లాపులు, కొన్ని ఈవెంట్లలో చేసిన ఛాలెంజ్ లు బెడిసికొట్టడంతో నెటిజన్లు ఆయన్ని గట్టిగానే ఆడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకుంటూ, ఇప్పుడు తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేస్తున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ గా 'ఎపిక్' సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.
గత రెండు మూడు నెలలుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనికి తోడు ఆయన మాట్లాడిన మాటలపై విమర్శలు వచ్చాయి. "లాస్ట్ రెండు మూడు నెలల్లో నన్ను బాగా ఎక్కారు కదా" అంటూ ఆ ట్రోల్స్ ను స్పోర్టివ్ గా తీసుకున్న నాగవంశీ, ఇకపై ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే వచ్చే ఏడాది రాబోయే సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. 2026 ప్రథమార్ధంలో సితార బ్యానర్ నుంచి ప్రతి నెలా ఒక సినిమా రిలీజ్ కాబోతోందట. ఈసారి డేట్ల విషయంలో కంగారు పడకుండా, కేవలం కంటెంట్ బాగుంటేనే రిలీజ్ చేస్తానని ఆయన మాటిచ్చారు. మళ్ళీ నెటిజన్లకు ఒక్క కామెంట్ పాస్ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదనే కసి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రతి సినిమా కచ్చితంగా హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారట.
నాగవంశీ చేతిలో ఇప్పుడు భారీ లైనప్ ఉంది. నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', సిద్దు జొన్నలగడ్డ 'కోహినూర్', అల్లరి నరేష్ 'ఆల్కహాల్', విశ్వక్ సేన్ 'ఫంకీ', అఖిల్ 'లెనిన్', అశోక్ గల్లా 'విసా' వంటి క్రేజీ ప్రాజెక్టులన్నీ 2026లోనే క్యూ కట్టబోతున్నాయి. ఈ సినిమాలన్నీ దాదాపు షూటింగ్ దశలోనో, పోస్ట్ ప్రొడక్షన్ లోనో ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది సితార బ్యానర్ నుంచి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఖాయం.
గతంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, హడావిడి పడటం వల్ల కొన్ని దెబ్బతిన్నాయని నాగవంశీ గ్రహించారు. అందుకే ఈసారి డేట్ కంటే క్వాలిటీకే ఓటు వేస్తున్నారు. "హిట్ అవుతుంది అనుకుంటేనే రిలీజ్ చేస్తా" అని ఆయన చెప్పడం చూస్తుంటే, అవుట్ పుట్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. గత తప్పులను సరిదిద్దుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన గట్టిగానే ఫిక్స్ అయ్యారు.
ఏదేమైనా ట్రోలర్స్ కు తన విజయాలతోనే సమాధానం చెప్పాలని నాగవంశీ డిసైడ్ అయ్యారు. 2026లో రాబోయే ఈ అరడజను సినిమాలు కనుక హిట్ అయితే, మళ్ళీ టాలీవుడ్ లో సితార బ్యానర్ హవా నడుస్తుంది. మరి నాగవంశీ వేసిన ఈ కొత్త స్కెచ్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.
