'లెనిన్' ప్రీ-కాపీ చూసాక అఖిల్‌పై నాగార్జున ఫీలింగ్?
ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా సరిగ్గా తన తండ్రి నాగార్జున బాటలోనే ఓపికతో ఎదురుచూస్తున్నాడు.
By: Sivaji Kontham | 7 Jun 2026 3:55 PM ISTఅక్కినేని నాగార్జున సినీ కెరీర్ ఆరంభాన్ని గమనిస్తే.. మొదటి మూడు సినిమాలు ఆయనకు ఆశించిన విజయాలను అందించలేదు. విక్రమ్, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ వంటి చిత్రాలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నా సరైన బ్రేక్ దక్కలేదు. అయినా అక్కినేని నటవారసుడిగా నాగార్జున ఎంతో ఓపికతో వరుస చిత్రాల్లో నటిస్తూ తన నాల్గవ చిత్రమైన `మజ్ను`తో కెరీర్‌లోనే మైలురాయి లాంటి మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ ఒక్క సక్సెస్ కోసం ఆయన నాలుగు సినిమాల వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా సరిగ్గా తన తండ్రి నాగార్జున బాటలోనే ఓపికతో ఎదురుచూస్తున్నాడు. ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన అఖిల్, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (యావరేజ్ టాక్ తెచ్చుకుంది), ... భారీ అంచనాలతో వచ్చిన `ఏజెంట్` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలను అందించలేకపోయాయి. దీంతో అఖిల్ కూడా తన నాల్గవ సినిమా తర్వాతి చిత్రంతోనైనా సాలిడ్ హిట్ కొట్టి ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలో అఖిల్ ఎంతో వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకుని, నూతన దర్శకుడు నందు (మురళి కిషోర్ అబ్బూరి) దర్శకత్వంలో `లెనిన్` అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్- నాగార్జున బృందం భారీ అంచనాలనే పెట్టుకుంది. ఎన్నో వాయిదాలు, అంచనాల మధ్య ఈ నెల 26న థియేటర్లలోకి రానున్న `లెనిన్` చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ తీవ్రమైన క్యూరియాసిటీ నెలకొంది. చాలా కాలంగా అఖిల్‌కు దక్కని సరైన కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో కచ్చితంగా దక్కుతుందనే బలమైన నమ్మకంతో నాగార్జున ఉన్నారు.
ఈ సినిమాపై ఉన్న ప్రత్యేక శ్రద్ధతో మరో రోజులోనే ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ముందే కింగ్ నాగార్జున ఎంతో ఉత్కంఠగా చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వెర్షన్‌ను వీక్షించినట్లు ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ నటన .. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయని, సినిమా చూసిన తర్వాత నాగార్జున ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని ఒక సరికొత్త మాస్ అఖిల్‌ను వెండితెరపై చూడబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా... స్క్రీన్‌పై ఈ ఇద్దరి జంట `మేడ్ ఫర్ ఈచ్ అదర్` అన్నట్లుగా ఎంతో కంటికింపుగా కుదిరిందని అంతర్గత సమాచారం. భారీ యాక్షన్ కి ఆస్కారం ఉన్న రాయలసీమ బ్యాక్‌డ్రాప్.. సరికొత్త క్యారెక్టరైజేషన్.. అద్భుతమైన క్లైమాక్స్‌తో తెరకెక్కిన `లెనిన్` చిత్రం అక్కినేని అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందని అభిమానులు భావిస్తున్నారు.
