యూట్యూబ్‌లో ఉన్న నాగార్జున 'శాంతి క్రాంతి'కి అంత డిమాండ్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్లాసిక్ సినిమాలను 4K టెక్నాలజీతో రీమాస్టరింగ్ చేసి థియేటర్లలోకి తీసుకురావడం పెద్ద ట్రెండ్‌గా మారింది.
By: Sivaji Kontham | 12 Aug 2026 7:00 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్లాసిక్ సినిమాలను 4K టెక్నాలజీతో రీమాస్టరింగ్ చేసి థియేటర్లలోకి తీసుకురావడం పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున అభిమానులు .. 80, 90ల కాలం నాటి సినీ ప్రియుల దృష్టి నాగార్జున నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం `శాంతి క్రాంతి`పై పడింది. ప్రస్తుతం యూట్యూబ్‌లోనే అందుబాటులో ఉన్న ఈ సినిమాను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఆశపడుతున్న అభిమానులు, దీనిని 4K నాణ్యతతో రీ-రిలీజ్ చేయాలంటూ నిర్మాణ సంస్థకు ఫోన్లు చేసి మరీ విజ్ఞప్తులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేక డిజాస్టర్‌గా నిలిచిన.. పైగా నిర్మాతకు భారీ అప్పులు మిగిల్చిన ఒక సినిమాను ఇప్పుడు అభిమానులు ఏరికోరి థియేటర్లలో చూడాలనుకోవడం నిజంగా ఒక విడ్డూరమే. అయితే ఈ చిత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కన్నడ నటుడు, దర్శకుడు వి. రవిచంద్రన్ ఆ కాలంలోనే ఈ సినిమాను ఎంతో అడ్వాన్స్‌డ్ థింకింగ్ - హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించారు. నాలుగు భాషల్లో (తెలుగులో నాగార్జున, కన్నడంలో రవిచంద్రన్, తమిళం- హిందీలో రజనీకాంత్.. ఇలా వేర్వేరు అగ్ర హీరోలతో ఒకే సమయంలో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించడం అప్పట్లో ఒక గొప్ప సాహసంగా నిలిచింది.
ఈ చిత్ర కథాంశం విషయానికొస్తే.. సమాజంలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (అంగమార్పిడి) .. పిల్లల అపహరణల వెనుక ఉన్న ఒక విలన్ బ్లాక్ మార్కెట్ ముఠాపై పోరాడే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాగార్జున కనిపించారు. ఇందులో పోలీసాఫీసర్‌గా నాగార్జున చూపించిన స్టైలిష్ పెర్ఫామెన్స్, ఆయన లుక్స్ ఇప్పటికీ డీసెంట్‌గా అలరిస్తాయి. ఇక అందాల భామ జూహీ చావ్లాతో నాగార్జున రొమాంటిక్ సీన్లు, హంసలేఖ అందించిన మెలోడియస్ పాటలు .. చార్ట్‌బస్టర్ ట్రాక్స్ అప్పట్లో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సాంకేతికంగా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నా అత్యధిక బడ్జెట్ - భారీ నిర్మాణ వ్యయం కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. నాలుగు భాషల్లో నిర్మించడం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి.. చివరికి నిర్మాణ సంస్థకు అప్పట్లోనే దాదాపు రూ. 15 కోట్ల వరకు అప్పులు మిగిల్చింది. రవిచంద్రన్ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద ఆర్థికంగా కోలుకోలేని పంచ్ ఇచ్చిన చిత్రం. ఈ సినిమాలోని క్వాలిటీ, టెక్నికల్ మేకింగ్ - విజువల్స్ విషయంలో సినీ ప్రేమికుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేక గౌరవం ఉంది.
అందుకే ప్రస్తుతం నడుస్తున్న 4K రీ-రిలీజ్ ట్రెండ్‌లో `శాంతి క్రాంతి` సినిమాను గనుక రీమాస్టరింగ్ చేస్తే.. అది ఒక సరికొత్త విజువల్ ట్రీట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు గనుక రీ-రిలీజ్ ఆదరణ లభిస్తే.. నాగార్జున కెరీర్‌లో ఫ్లాపులుగా ముద్ర పడి ప్రత్యేకత ఉన్న సినిమాలుగా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఇతర క్లాసిక్స్ అయిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని `గోవిందా గోవిందా`, ప్రియదర్శన్ దర్శకత్వంలోని `నిర్ణయం` చిత్రాలను కూడా 4K డిజిటల్ వర్షన్‌లో రీమాస్టరింగ్ చేసి థియేటర్లకు తీసుకురావడానికి తగిన బాటలు వేసినట్లవుతుంది.
