శివ : అందరూ ఫ్లాప్ అన్నా ఏయన్నార్ మాత్రం...!
నాగార్జునకు శివ సినిమా కచ్చితంగా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహం లేదు.
By: Ramesh Palla | 11 Nov 2025 11:02 AM IST1990లో వచ్చిన 'శివ' సినిమా ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకత్వంలో అనుభవం లేకుండా వర్మ ఆ సినిమాను రూపొందించాడు. హాలీవుడ్ సినిమాలు అంటే పిచ్చి అభిమానం చూపించే వర్మ, ఆ రేంజ్‌కు ఇండియన్ సినిమాను తీసుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో కొత్త తరహా కథ, కథనంను ఎంపిక చేసుకున్నాడు. ఆ సమయంలో చాలా మంది వర్మను నమ్మలేదు. ఇలాంటివి చూస్తారా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ శివ సినిమాను రూపొందించి, నిర్మాతను, హీరో నాగార్జునను తన కథతో నమ్మకం కలిగించి, తాను ఏది చెబితే అది చేసుకుంటూ పోయే విధంగా ఒప్పించడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా...
నాగార్జునకు శివ సినిమా కచ్చితంగా చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయే సినిమాగా కూడా శివ సినిమా నిలిచింది. నాగార్జున ను అప్పటి వరకు ప్రేక్షకులు చూసింది ఒక తీరుగా అయితే శివ సినిమాలో చూసింది మరో తీరుగా అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా ను ఇలా కూడా తీయవచ్చా అని అప్పట్లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సైతం నోరు వెళ్లబెట్టి మరీ చూసిన సినిమా శివ అంటారు. అందుకే శివ సినిమా వచ్చి 35 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులకు శివ సినిమా చాలా స్పెషల్ అనుకోవచ్చు. ఒక జనరేషన్ ను ఇన్సిఫైర్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన శివను మళ్లీ తీసుకు వచ్చేందుకు సిద్ధం అయిన విషయం తెల్సిందే.
నవంబర్ 15న శివ రీ రిలీజ్...
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లు కామన్ అయ్యాయి. కానీ శివ సినిమాను అంతకు మించి అన్నట్లుగా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా నాగార్జు, అమల కు అత్యంత కీలకం. అందుకే సినిమా రీ రిలీజ్ ప్రమోషన్‌లో ఇద్దరూ పాల్గొంటున్నారు. నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన వర్మ, నాగార్జున అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముఖ్యంగా శివ సినిమా మేకింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, విడుదల తర్వాత వచ్చిన టాక్ గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన రెండు మూడు రోజుల వరకు టాక్ విషయంలో క్లారిటీ లేదట. కానీ ఏఎన్నార్ మాత్రం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అని అన్నారట.
నాగార్జున శివ గురించి అక్కినేని నాగేశ్వరరావు రివ్యూ...
మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్.. శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏయన్నార్ గారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటూ నాగార్జునను ప్రశ్నించిన సమయంలో నాగ్ స్పందిస్తూ... శివ సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత నేను నాన్న కారులో వెళ్తున్నాం. ఆ సమయంలో నాన్న కారు తోలుతున్నాడు. అప్పటికే సినిమా గురించి నెగటివ్‌గా ప్రచారం జరుగుతుంది. కామెడీ లేదు, ఆడవారు సినిమాకు రారు, ఇలాంటి సినిమాను చూస్తారా అని చాలా మంది అంటున్నారు. ఆ సమయంలో నాన్న గారు తప్పకుండా ఈసినిమా ఎక్కడికో వెళ్తుంది, ఇది ఎంత దూరం నిన్ను తీసుకు వెళ్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం అన్నారు. ఆ సమయంలోనే నాన్న గారు శివ సినిమా సక్సెస్ చాలా భారీ రేంజ్ లో ఉంటుందని ఊహించారు. అన్నట్లుగానే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని నాగార్జున అన్నారు. ఇక వర్మను శివ ను ఇప్పుడు అయితే ఎవరితో తీస్తారు అంటే శివ అంటే నాగార్జున తప్ప మరెవ్వరూ కారు అని అన్నారు.
