Begin typing your search above and press return to search.

పైరసీపై పోరాడే ఏకైక రాష్ట్రం తెలంగాణనే: నాగార్జున

పైరసీ భూతం ఇండస్ట్రీని ఏ రేంజ్ లో పట్టి పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు గంటల వ్యవధిలో ఇంటర్నెట్ లోకి వచ్చేస్తుంటే మేకర్స్ కు దిక్కు తోచని పరిస్థితి.

By:  M Prashanth   |   15 Aug 2026 10:43 AM IST
పైరసీపై పోరాడే ఏకైక రాష్ట్రం తెలంగాణనే: నాగార్జున
X

పైరసీ భూతం ఇండస్ట్రీని ఏ రేంజ్ లో పట్టి పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు గంటల వ్యవధిలో ఇంటర్నెట్ లోకి వచ్చేస్తుంటే మేకర్స్ కు దిక్కు తోచని పరిస్థితి. అయితే ఇటీవల జరిగిన తిరంగా కా సురక్ష సైబర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో టాలీవుడ్ కింగ్ నాగార్జున సరిగ్గా ఇదే టాపిక్ మీద మాట్లాడాడు. ఇండస్ట్రీని ఇంతగా వేధిస్తున్న ఈ పైరసీ సమస్య మీద సపోర్ట్ గా ఉన్న పోలీసుల గురించి నాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ పైరసీని అరికట్టే విషయంలో మొదటి అడుగు వేసింది పోలీసు అధికారి సీవీ ఆనంద్ అని నాగార్జున ఈ ఈవెంట్ లో గుర్తు చేసుకున్నాడు. ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ తోనే ఇండస్ట్రీకి ఒక నమ్మకం వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన మరో ఉన్నతాధికారి సజ్జనార్ కూడా ఇదే ఫ్లోలో పైరసీ మీద గట్టిగా ఫోకస్ చేశారని నాగ్ మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరు స్వయంగా చొరవ తీసుకుని ఈ విషయంలో సినిమా వాళ్లకు ఎంతగానో సపోర్ట్ చేశారని ఈ సందర్భంగా నాగార్జున గుర్తు చేశాడు.

అసలు ఈ పైరసీ బాధ ఈనాటిది కాదని నాగార్జున ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్పాడు. ఒకప్పుడు వీసీఆర్ ల కాలం నుంచి మొదలైన ఈ సమస్య, ఆ తర్వాత సీడీల రూపంలో ఇండస్ట్రీని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఇంటర్నెట్ రూపంలో ఈ పైరసీ వ్యవహారం ఎక్కడికో వెళ్లిపోయిందని క్లియర్ గా వివరించారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ పైరసీ చేసే వాళ్ల పద్ధతులు కూడా మారిపోతూనే ఉన్నాయని ఆయన అన్నాడు.

దేశం మొత్తం మీద సినిమా వాళ్లకు పైరసీ విషయంలో అండగా నిలబడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నాగార్జున తెలిపారు. ఇండియాలో వేరే ఏ రాష్ట్రం కూడా ఈ పైరసీని కంట్రోల్ చేసే విషయంలో ఇంత యాక్టివ్ గా లేదని అన్నారు. సినిమా వాళ్లకు ఇలాంటి సపోర్ట్ దొరకడం నిజంగా చాలా మంచి విషయమని చెప్పుకొచ్చాడు.

పైరసీ చేసేవారిని అడ్డుకోవడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పడుతున్న కష్టాన్ని నాగార్జున స్పెషల్ గా ప్రస్తావించాడు. సైబర్ నేరగాళ్లు ఎక్కడో దాక్కున్నా వదిలిపెట్టకుండా యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పాడు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా భోపాల్ లాంటి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి మరీ పైరసీ చేస్తున్న వాళ్లను మన పోలీసులు పట్టుకొచ్చారని ఈ మీటింగ్ లో గుర్తు చేశాడు. ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఆపరేషన్స్ చేయడం వల్లే ఇండస్ట్రీకి పోలీసుల మీద నమ్మకం మరింత పెరిగిందని అన్నాడు.

తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ సాయానికి నాగార్జున కేవలం తెలుగు ఇండస్ట్రీ తరపున మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా తరపున కృతజ్ఞతలు చెప్పాడు. పైరసీ అనేది అన్ని భాషల సినిమాలకు ముప్పే కాబట్టి తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేకర్స్ కు మేలు చేస్తోందని అన్నారు. ఇలాగే పోలీసుల సపోర్ట్ కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో ఈ పైరసీ బాధ చాలా వరకు తగ్గే అవకాశం ఉందన్నాడు.