పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన నెగిటివ్ రోల్
మన్మథుడుగా, లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్న నాగార్జున కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్ లోనే ప్రయోగాలు చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 5 Aug 2025 1:02 PM ISTఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే అందులో థ్రిల్ ఏముంటుంది అందుకే ఎప్పుడూ ఏదొక ప్రయోగాలు చేయాలని చూస్తుంటారు కొందరు నటులు. అందులో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నాగార్జున తన జర్నీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఎవరూ చేయలేని సాహసాలు కూడా నాగ్ చేశారు.
కెరీర్లో ఎన్నో సాహసాలు
మన్మథుడుగా, లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్న నాగార్జున కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్ లోనే ప్రయోగాలు చేశారు. నిన్నే పెళ్లాడతా లాంటి సూపర్ హిట్ తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేయాలన్నా ఆయనకే చెల్లింది. శ్రీ రామదాసులో రామ భక్తుడిగా, షిర్డీ సాయి సినిమా చేయడమూ ఇవన్నీ నాగార్జున మాత్రమే చేయగలిగిన సాహసాలు.
కుబేరతో కొత్తగా ప్రయత్నం
ఆ సినిమాలు కొంచెం అటూ ఇటూ అయినా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఎవరూ ఊహించలేం. అవన్నీ తెలిసి కూడా నాగ్ ఆ ప్రయోగాలు చేశారు. ప్రయోగాల్లో భాగంగానే కొత్తగా చేయాలనే ఆసక్తితో ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేస్తుంటానన్నారు కింగ్ నాగార్జున. రీసెంట్ గా కుబేరలో డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించి ఆకట్టుకున్న నాగార్జున ఇప్పుడు రజినీకాంత్ తో కలిసి కూలీ సినిమాలో చేస్తున్నారు.
నిన్నే పెళ్లాడతా నుంచి సైమన్ వరకు
అయితే కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సైమన్ అనే క్యారెక్టర్ లో కనిపించనున్న నాగ్,ఆ రోల్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని, తనకు పాజిటివ్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చిన నెగిటివ్ పాత్ర సైమన్ అని, సైమన్ రోల్ తనను మరింత గొప్ప నటుడిగా మార్చిందని చెప్పారు. నిన్నే పెళ్లాడతా నుంచి కూలీ వరకు తానెప్పుడూ కొత్త పాత్రలను ఎంచుకుంటూనే ఉన్నానని చెప్పారు నాగ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ లాంటి భారీ తారాగణం నటించింది.
