కింగ్ నాగార్జున చేసింది రైటా..రాంగా?
కొంత మంది ఒకటి చేయాలనుకుని మరొకటి చేస్తుంటారు. వచ్చిన అవకాశాల్లో ఏది గోల్డెన్ ఛాన్స్.. ఏది పనికి రానిది అన్నది గుర్తించలేరు.
By: Tupaki Entertainment Desk | 19 Jan 2026 11:32 AM ISTకొంత మంది ఒకటి చేయాలనుకుని మరొకటి చేస్తుంటారు. వచ్చిన అవకాశాల్లో ఏది గోల్డెన్ ఛాన్స్.. ఏది పనికి రానిది అన్నది గుర్తించలేరు. దాంతో కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూపమైన..అరుదైన అవకాశాల్ని చేజార్చుకుంటుంటారు. కింగ్ నాగార్జున ఇప్పుడు అదే చేశాడా?.. అంటే యస్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన సెన్సేషనల్ మూవీ `ధురంధర్`. ఆదిత్య ధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధిస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల ప్రభంజనాన్ని సృష్టిస్తూ వరుసగా రికార్డుల్ని తిరగరాస్తోంది. ఇందులో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్‌దత్, సారా అర్జున్, రాకేష బేడీ కీలక పాత్రల్లో నటించారు. అండర్ కవర్ రా ఏజెంట్ హమ్జాగా రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ మూవీలో రహమాన్ డకాయత్ క్యారెక్టర్‌లో అక్షయ్ ఖన్నా లైఫ్ టైమ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రణ్‌వీర్ సింగ్ క్యారెక్టర్‌కు మించి అక్షయ్ ఖన్నా చేసిన పాత్ర డామినేట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అక్షయ్ ఖన్నా క్యారెక్టరే నెట్టింట వైరల్‌గా మారి ఆయనని మరింత పాపులర్ అయ్యేలా చేసింది.
అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ మన కింగ్ నాగార్జుననే అనుకున్నారట. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకు స్టోరీ, రహమాన్ డకాయత్ క్యారెక్టర్ కూడా చెప్పారట. అయితే కింగ్ అప్పటికే రజనీకాంత్ `కూలీ`, ధనుష్ `కుబేర` సినిమాల్లో నటిస్తుండటం, వాటికి మించి డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి వీలు లేకపోవడంతో `ధురంధర్` మూవీని వదులు కున్నాడని, ఆ తరువాతే తాము ఈ క్యారెక్టర్ కోసం అక్షయ్ ఖన్నాని సంప్రదించామని తాజాగా ఈ సినిమా టీమ్ తెలపడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
`ధురంధర్`లో హీరో రణ్‌వీర్ సింగ్ అయినా క్రెడిట్ మొత్తం అక్షయ్ ఖన్నాకే వెళ్లింది. దీనికి ప్రధాన కారణం అక్షయ్ పోషించిన రహమాన్ డకాయత్ క్యారెక్టర్. సినిమాలో అక్షయ్ ఖన్నా ఎక్కడా కనిపించలేదు. కేవలం రహమాన్ డకాయత్ మాత్రమే కనిపించాడు. ఆ స్థాయిలో తనదైన అద్భుతమైన నటనతో అక్షయ్ ఈ క్యారెక్టర్‌ని రక్తికట్టించిన తీరు ఎంతో మంది ప్రముఖులతో పాటు సగటు ప్రేక్షకుడిని మంత్ర ముగ్థుడిని చేసింది. చిన్న సిగ్నేచర్ స్టెప్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అయిందంటే అక్షయ్ ఖన్నా రహమాన్ డకాయత్ క్యారెక్టర్‌ని ఏ స్థాయిలో తెరపై ఆవిష్కరించాడో అర్థం చేసుకోవచ్చు.
ఆరోగ్యం సహకరించని సందర్భాల్లోనూ అక్షయ్ అవేవీ పట్టించుకోకుండా క్యారెక్ట్‌లో లీనమై దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌ని `కూలీ, కుబేర కోసం వదులుకుని కింగ్ నాగార్జున తప్పు చేశాడని ఓ వర్గం కామెంట్ చేస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాగ్ మంచి పనే చేశాడని, తను ఆ క్యారెక్టర్ చేసి ఉంటే ఈ రేంజ్‌లో ఉండేది కాదని, అక్షయ్ హాలీవుడ్ రేంజ్ యాక్టర్ తరహాలో రహమాన్ డకాయత్ క్యారెక్టర్‌ని రక్తికట్టించి ఔరా అనిపించాడని అంటున్నారు. అంతే కాకుండా కేవలం తన కళ్లు, సైగలతోనే క్యారెక్టర్ డెప్త్ ఏంటో చూపించాడని ప్రశంసిస్తున్నారు.
