Begin typing your search above and press return to search.

చింటూ అన్నకు AP అంతా రిలీజ్ చేసేంత కాన్ఫిడెన్స్.. నాగార్జున కామెంట్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌!

స్టేజ్ పైకి రాగానే నాగార్జున అక్కడున్న అభిమానులను ఉద్దేశించి.. మీరంతా `చింటూ అన్న` అని పిలుస్తారు కదా? అంటూ చాలా సరదాగా సంభాషణను ప్రారంభించి అందరిలో జోష్ నింపారు.

By:  Sivaji Kontham   |   6 July 2026 9:28 AM IST
చింటూ అన్నకు AP అంతా రిలీజ్ చేసేంత కాన్ఫిడెన్స్.. నాగార్జున కామెంట్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌!
X

అక్కినేని అఖిల్, భాగ్య‌శ్రీ భోర్సే జంటగా మురళి కిషోర్ అబ్బూరి(నందు) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా `లెనిన్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- అన్నపూర్ణ స్టూడియోస్ - మనమ్ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ అక్కినేని నాగార్జున స్టేజ్ పైన చేసిన సందడి, మాట్లాడిన మాటలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ (చింటూ) గురించి నాగార్జున తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

స్టేజ్ పైకి రాగానే నాగార్జున అక్కడున్న అభిమానులను ఉద్దేశించి.. మీరంతా `చింటూ అన్న` అని పిలుస్తారు కదా? అంటూ చాలా సరదాగా సంభాషణను ప్రారంభించి అందరిలో జోష్ నింపారు. తెలుగు సినీ పరిశ్రమలో సోషల్ మీడియాలో `చింటూ` అన్న అనే పేరు బాగా ఫేమ‌స్ అయింది. నాగవంశీ ఇచ్చే బోల్డ్, ఇంటెన్స్ ఇంటర్వ్యూలు.. బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆయన మాట్లాడే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటల వల్ల నెటిజన్లు ఆయన్ను ప్రేమగా.. కాస్త సరదాగా మీమ్స్‌తో ట్రోల్ చేస్తూ ఈ నిక్‌నేమ్‌ను వైరల్ చేశారు. ఈ క్రేజ్‌ను నాగార్జున స్టేజ్ పైన ప్రస్తావించడంతో అటు అభిమానులు, ఇటు పరిశ్రమ వర్గాలు ఎంతగానో ఎంజాయ్ చేశాయి.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ సినిమా పరిజ్ఞానాన్ని నాగార్జున ప్ర‌శంసించారు. చింటూ అన్న‌కు ప్రేక్షకుల `మాస్ పల్స్` ఏంటో చాలా బాగా తెలుసని, సినిమా బిజినెస్ .. ఆడియన్స్ నాడిపై అత‌డికి అపారమైన అవగాహన ఉందని అభినందించారు. అంతేకాకుండా.. తనకు అలాగే తన కుమారుడు అఖిల్‌కు నాగవంశీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా.. ప్రాజెక్ట్‌కు ఏం కావాలన్నా వెనకాడకుండా ఎంతో సపోర్ట్‌గా నిలిచినందుకు `చింటూ అన్న`పై నాగార్జున తన కృతజ్ఞతను చాటుకున్నారు.

`లెనిన్` చిత్రం అవుట్‌పుట్ పై నిర్మాత నాగవంశీ పెట్టుకున్న నమ్మకాన్ని నాగార్జున ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాపై చింటూ అన్నకు ఎంత నమ్మకం ఉందంటే... ఆంధ్రప్రదేశ్ (ఏపీ) టోటల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అంతా ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారని నాగార్జున వెల్లడించారు. ఒక నిర్మాత సినిమాను కేవలం నిర్మించడమే కాకుండా.. టోటల్ ఏరియా డిస్ట్రిబ్యూషన్‌ను స్వయంగా భుజాన వేసుకోవడం అనేది కంటెంట్‌పై ఉన్న అపారమైన కాన్ఫిడెన్స్‌కు నిదర్శనమని.. ఇది సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే సంకేతాన్ని ఇస్తోందన్నారు.

ఇలా సినిమా గురించి, నిర్మాత గురించి ఎంతో సపోర్టివ్‌గా మాట్లాడిన కింగ్ నాగార్జున.. ప్రసంగం ఆరంభంలోనే తన మార్క్ వింటేజ్ హ్యూమర్‌తో నవ్వులు పూయించారు.``నాకో చిన్న ప్రాబ్లం ఉంది, నా పార్ట‌న‌ర్ ఒకరు ఉన్నారు...`` అంటూ స్టేజ్ పైన ఉన్న తన పార్ట‌న‌ర్ (నాగ‌వంశీ)ని సరదాగా ఆటపట్టించడం అంద‌రినీ అల‌రించింది. నాగార్జున చేసిన ఈ స‌ర‌దా వ్యాఖ్యలు, చూపించిన సాన్నిహిత్యం అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి. తండ్రిగా అఖిల్ సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే.. ఒక స‌హ‌ నిర్మాత‌గా బిజినెస్ విషయాలను హైలైట్ చేస్తూ నాగార్జున చేసిన ఈ ప్రసంగం `లెనిన్` సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. జూలై 10న లెనిన్ గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.