కింగ్ 100: దేవికి అసలైన ఛాలెంజ్..
నాగార్జున కింగ్ 100 గ్లింప్స్‌లో వినిపించిన బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే థీమ్‌ను ఓఎస్‌టీ లిరికల్‌గా విడుదల చేశారు.
By: M Prashanth | 15 Sept 2026 9:47 AM ISTనాగార్జున కింగ్ 100 గ్లింప్స్‌లో వినిపించిన బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే థీమ్‌ను ఓఎస్‌టీ లిరికల్‌గా విడుదల చేశారు. గ్లింప్స్ వచ్చినప్పుడే నాగ్ లుక్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మాట్లాడుకునేలా చేసింది. వందో సినిమా కావడంతో నాగార్జున మీద ఉండే అంచనాలకు తగ్గట్టుగా ఒక రాయల్ టచ్ ఇచ్చాడు దేవి. ఇప్పుడు ఆ చిన్న థీమ్‌ను పూర్తి వెర్షన్‌లో కూడా బయటకు తీసుకొచ్చారు.
దేవిశ్రీకి ఈ సినిమా కాస్త ముఖ్యమైనదే. పుష్ప 2 తర్వాత ఆ స్థాయిలో భారీ పాన్ ఇండియా సినిమా ఆయన చేతిలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఎల్లమ్మలో హీరోగా కూడా చేస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాకు సంగీతం కూడా దేవినే అందిస్తున్నారు. దీంతో ఒకేసారి నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పనులు చూసుకుంటున్న సమయంలో ఆయన మ్యూజిక్ మీద ఫోకస్ తగ్గుతుందా అనే డౌట్ మొదట్లో వచ్చింది.
ఎందుకంటే దేవిశ్రీ పేరు వినగానే ఒకప్పుడు సినిమా ఆల్బమ్ మీదే అంచనాలు ఉండేవి. ఆర్య, బొమ్మరిల్లు, జల్సా నుంచి రంగస్థలం, పుష్ప వరకు ఎన్నో సినిమాల్లో పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనకు పెద్ద బలం. కానీ గత కొంతకాలంగా ప్రతి సినిమాకూ అదే స్థాయి ఆల్బమ్ రావడం లేదు. అందుకే ఎల్లమ్మతో హీరోగా మారుతున్న టైమ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి ఎలా కొనసాగుతాడన్న ఆసక్తి సహజంగానే వచ్చింది.
కింగ్ 100 గ్లింప్స్ మాత్రం ఆ డౌట్‌ను కొంతవరకు తగ్గించింది. నాగార్జున ఎంట్రీకి ఇచ్చిన బీట్, మధ్యలో వచ్చే మ్యూజిక్ పీస్ గ్లింప్స్‌కు మంచి ఊపు ఇచ్చాయి. ఇప్పుడు ఓఎస్‌టీని విడిగా విడుదల చేయడం కూడా టీమ్ ఆ థీమ్‌పై నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీపక్ పాడిన ఈ ట్రాక్‌కు వీఎస్‌హెచ్‌ఎన్ సాహిత్యం అందించారు.
అయితే ఒక్క గ్లింప్స్ బీజీఎంతో దేవిశ్రీ పని పూర్తయినట్టు కాదు. నాగార్జున సినిమాల్లో పాటలకు ఎప్పుడూ మంచి స్పేస్ ఉంటుంది. మన్మథుడు, మాస్, కింగ్ లాంటి సినిమాల్లో దేవి ఇచ్చిన పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్స్. కింగ్ 100లో కూడా నాగ్ స్టైల్‌కు సరిపోయే పాటలు పడితేనే ఈ కాంబినేషన్‌కు పూర్తి మార్కులు పడతాయి. ముఖ్యంగా మొదటి సాంగ్ నుంచే ఆల్బమ్ మీద ఆసక్తి పెరగాలి.
డిసెంబర్ 24న కింగ్ 100 థియేటర్లలోకి రానుంది. ఎల్లమ్మతో హీరోగా తన కొత్త జర్నీ మొదలుపెట్టిన దేవికి, అదే సమయంలో కింగ్ 100 సంగీతం మరో ఛాలెంజ్ గా మారింది. గ్లింప్స్ బీజీఎంతో మొదటి ఇంప్రెషన్ బాగానే వచ్చింది. ఇక పాటలు కూడా అదే స్థాయిలో పడితే, నటన వైపు వెళ్లినా మ్యూజిక్ విషయంలో దేవి తగ్గలేదనే మాట మరింత బలంగా వినిపిస్తుంది.
