Begin typing your search above and press return to search.

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ విడుదల తేదీపై వస్తున్న వాయిదా ప్రచారానికి మేకర్స్ చెక్ పెట్టారు. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌తో ప్రకటించారు. షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

By:  M Prashanth   |   24 Nov 2026 11:40 PM IST
King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!
X

సినిమా షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ రకరకాల వార్తలు రావడం కామనే. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు పోటీ ఎక్కువగా ఉంటే వాయిదా రూమర్స్ కూడా మొదలైపోతాయి. నాగార్జున వందో సినిమా విషయంలోనూ అదే జరిగింది. క్రిస్మస్ సీజన్‌లో భారీ సినిమాలు ఉండటంతో నాగ్ మరో డేట్ చూసుకుంటున్నారనే టాక్ వినిపించింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ మాత్రం ఆ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమ ప్లాన్ ప్రకారమే వెళ్తోంది.




డిసెంబర్ 24న కింగ్ 100 విడుదల చేయాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. రిలీజ్‌కు 30 రోజులే ఉందంటూ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో వాయిదా వార్తలకు చెక్ పడింది. నిజానికి వందో సినిమా కోసం నాగ్ మరో మంచి డేట్ చూసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్మస్ సెలవులను వదులుకునే ఆలోచన మేకర్స్‌కు లేనట్లుంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తికావడంతో రిలీజ్ ప్లాన్ మార్చాల్సిన అవసరం కనిపించడం లేదు.

నాగార్జున వందో సినిమాను సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే నిర్మిస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాల్లో టీమ్ ముందుగానే ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త దర్శకుడు రా కార్తీక్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం కూడా విశేషమే. నార్మల్ గా వందో సినిమా అనగానే స్టార్ డైరెక్టర్ ఎవరినైనా లైన్ లో పెట్టడం కామన్. నాగ్ మాత్రం కొత్త దర్శకుడి కథతో ముందుకెళ్లారు.

ఇక సినిమా విషయానికొస్తే నాగార్జున, టబు మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. గతంలో నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కానీ ఈసారి ప్రేమకథ కాదు. ఇద్దరినీ ప్రత్యర్థులుగా చూపిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ హింట్ ఇచ్చింది. అశోక్ సెల్వన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పైనా మంచి అంచనాలే ఉన్నాయి.

లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్‌లో నాగ్ లుక్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. బ్లాక్ సూట్ వేసుకుని పాత మోడల్ కారు ముందు స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మొత్తం పోస్టర్‌ను రెడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ చేశారు. గతంలో వచ్చిన బర్త్‌డే గ్లింప్స్‌తో పోలిస్తే ఈసారి నాగ్ స్టైల్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే సినిమా కథ ఏ నేపథ్యంలో సాగుతుందనే విషయాన్ని మేకర్స్ ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు.

ప్రస్తుతం కింగ్ 100 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 24 రిలీజ్‌కు ఇంకా నెల రోజులే మిగిలింది. ఇప్పటివరకు నాగార్జున, టబు పాత్రలను పరిచయం చేసిన టీమ్ త్వరలో మిగతా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయనుంది. ముఖ్యంగా ట్రైలర్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. క్రిస్మస్ బరిలో బాలకృష్ణ దాదా కూడా ఉంది. కాబట్టి థియేటర్ల కేటాయింపు లో క్లాష్ ఉండవచ్చు.