Begin typing your search above and press return to search.

నాగ్‌కు మంత్రి ప్ర‌శ్న‌.. తెలంగాణ సినిమాలు చేయ‌రా?

సందీప్ రెడ్డి వంగ‌, త‌రుణ్ భాస్క‌ర్ లాంటి ద‌ర్శ‌కులు అర్బ‌న్ తెలంగాణ క‌థ‌ల‌తో సినిమాలు తీసి, ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించ‌డం ద్వారా తెలంగాణ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేశారు.

By:  Garuda Media   |   11 Aug 2026 6:40 PM IST
నాగ్‌కు మంత్రి ప్ర‌శ్న‌.. తెలంగాణ సినిమాలు చేయ‌రా?
X

ఒక‌ప్ప‌టితో పోలిస్తే తెలుగు తెర‌పై తెలంగాణ క‌థ‌లు బాగా పెరిగాయి. ఒక‌ప్పుడు తెలంగాణ నేప‌థ్యంలో సినిమాలు తీసినా.. అవి ఉద్య‌మ నేప‌థ్యంలో, విప్ల‌వ క‌థ‌ల‌తో ఉండేవి. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో తెలంగాణ క‌థ‌ల‌తో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ బాగా పెరిగాయి. సందీప్ రెడ్డి వంగ‌, త‌రుణ్ భాస్క‌ర్ లాంటి ద‌ర్శ‌కులు అర్బ‌న్ తెలంగాణ క‌థ‌ల‌తో సినిమాలు తీసి, ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించ‌డం ద్వారా తెలంగాణ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేశారు.

దీంతో పేరున్న‌ హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా ఇక్క‌డి నేప‌థ్యాల‌తో, యాస‌-భాష‌ల‌తో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సీనియ‌ర్ హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్ అక్కినేని నాగార్జున కూడా ఈ దారిలోకి వ‌చ్చారు. ప‌ళ్ళ‌బురుసు పేరుతో అచ్చ‌మైన తెలంగాణ సినిమా తీశారు. ఒక టూత్ బ్ర‌ష్ నేప‌థ్యంలో వెరైటీ కాన్సెప్ట్‌తో తెలంగాణ ప‌ల్లెటూరు మ‌నుషుల క‌థ‌ను చెప్ప‌బోతున్నారీ సినిమాలో. ఆగ‌స్టు 14న రిలీజ‌వుతున్న ఈ ప్రయోగాత్మ‌క‌ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించింది.

ఈ సినిమా ప్రెస్ మీట్లో నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమా త‌మ‌కు ఎంతో ఇచ్చింద‌ని, సినిమాకు తిరిగి ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే మ‌ళ్లీ ప్రొడ‌క్ష‌న్ పెంచామ‌ని నాగ్ తెలిపాడు. ఈ మ‌ధ్యే లెనిన్ వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లో రంభ ఊర్వ‌శి మేన‌క సినిమా త‌న బేన‌ర్ నుంచి వస్తుంద‌ని, ఆపై త‌న వందో చిత్రం రిలీజ‌వుతుంద‌ని నాగ్ తెలిపాడు. ఇలా వ‌రుస‌గా సినిమాలు తీస్తున్న‌ట్లు చెప్పిన నాగ్.. గ‌తంలో తెలంగాణ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ను క‌లిసిన‌పుడు.. మీరు తెలంగాణ క‌థ‌ల‌తో సినిమాలు ఎందుకు తీయ‌ర‌ని ప్ర‌శ్నించించినట్లు నాగ్ తెలిపాడు.

అప్పుడు నిజ‌మే క‌దా అనిపించింద‌ని, ఆంధ్ర నేప‌థ్యంలో సోగ్గాడే చిన్నినాయ‌నా, రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో లెనిన్ చేశామ‌ని.. మ‌రి తెలంగాణ క‌థ‌ను చెప్ప‌క‌పోతే ఎలా అనిపించి ఆలోచించిన‌పుడు ప్ర‌సాద్ నిమ్మ‌కాయ‌ల ప‌ళ్ళ‌బురుసు స్టోరీ త‌న ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడ‌ని, అలా ఈ సినిమా తెర‌కెక్కింద‌ని చెప్పాడు నాగ్. ఇది త‌మ బేన‌ర్లో చాలా మంచి సినిమా అవుతుంద‌ని ఆయ‌న ధీమా వ్యక్తం చేశాడాయ‌న‌.