ఏఎన్నార్ వారసత్వం నుంచి సొంత గుర్తింపు !
దివంగత లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అడుగుపెట్టి తనదైన శైలితో కింగ్ గా ఎదిగిన నటుడు అక్కినేని నాగార్జున.
By: Srikanth Kontham | 23 May 2026 11:55 PM ISTదివంగత లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అడుగుపెట్టి తనదైన శైలితో కింగ్ గా ఎదిగిన నటుడు అక్కినేని నాగార్జున. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసిన నాగ్ కెరీర్ తొలినాళ్లపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒక స్టార్ హీరో కుమారుడిగా పరిశ్రమలోకి రావడం సులభమే అయినా? నటుడిగా నిలదొక్కుకోవడానికి పడిన మథనాన్ని నాగార్జున తాజాగా గుర్తు చేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో వచ్చిన చిత్రాల విజయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నాగార్జున నిజాయితీగా అంగీక రించారు.
అప్పట్లో తన సినిమాలు ఆడటానికి కారణం నటన కంటే లెజెండరీ నటుడు ఏఎన్నార్ కుమారుడు ఎలా నటిస్తున్నాడో ? చూడాలనే ప్రేక్షకుల కుతూహలమేనని పేర్కొన్నారు. ప్రేక్షకులు తనపై చూపిన ఆ అభిమానమే తొలినాళ్లలో తన చిత్రాలకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టిందన్నారు. అయితే వారసత్వంతోనే ఎక్కువ కాలం కొనసాగలేమనే విషయాన్ని తాను త్వరగానే గ్రహించానన్నారు. వాణిజ్య చిత్రాల ఫార్ములాలో కొట్టుకుపోకుండా? నటుడిగా తనలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే దర్శకుడి కోసం అన్వేషిస్తున్న తరుణంలో మణిరత్నం సినిమా నాగార్జున దృష్టిని ఆకర్షించింది.
అప్పటికే మలయాళ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేస్తున్న మణిరత్నం మేకింగ్ స్టైల్ నాగార్జునకు ఎంతో నచ్చింది. కేవలం మాస్ మసాలా చిత్రాలే కాకుండా పాత్రల్లో సహజత్వాన్ని ఇష్టపడే నాగార్జునకు మణిరత్నం చిత్రాలు కొత్త ఆశను రేకెత్తించాయి. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ ఫిల్మ్ `మౌనరాగం` చూసిన తర్వాత నాగార్జునలో బలమైన నమ్మకం ఏర్పడింది. ఆ సినిమాలో పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు, నిశ్శబ్దంలోనే పలికే హావభావాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ దర్శకుడైతే ఖచ్చితంగా తనలోని సరికొత్త నటనను, వైవిధ్యమైన కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించగలడని `మౌనరాగం` చూశాకే తనకు పూర్తి నమ్మకం కుదిరిందని నాగార్జున వెల్లడించారు.
ఆ నమ్మకమే టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయే క్లాసిక్ ప్రేమకథ `గీతాంజలి` (1989) రూపకల్పనకు బీజం వేసింది. నాగార్జున నమ్మినట్లుగానే మణిరత్నం ఆయనను సరికొత్తగా, ఎంతో అందంగా చూపించారు. చావుకు దగ్గరవుతున్న యువకుడి పాత్రలో నాగార్జున పండించిన నటన, ఆయనను ఏఎన్నార్ వారసుడిగానే కాకుండా గొప్ప నటుడిగా ఇండస్ట్రీలో స్థిరపరిచింది. ఈ చిత్రం నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు. ఆయనకు ప్రేమకథల కథానాయకుడు అనే ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. సినిమా రంగంలో వారసత్వం అనేది మొదటి అడుగుకు మాత్రమే. ఆ తర్వాత నిలబడాలంటే సొంత ప్రతిభ , సరైన దర్శకులను ఎంచుకునే చాతుర్యం ఉండాలని నాగార్జున ప్రయాణం నిరూపిస్తుంది.
