Begin typing your search above and press return to search.

కింగ్ నాగార్జున జీవితంలో బెస్ట్ ఇన్వెస్టిమెంట్!

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున కేవలం నటుడిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగానూ తనదైన ముద్ర వేశారు.

By:  Sivaji Kontham   |   13 Aug 2026 12:00 AM IST
కింగ్ నాగార్జున జీవితంలో బెస్ట్ ఇన్వెస్టిమెంట్!
X

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ అక్కినేని నాగార్జున కేవలం నటుడిగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగానూ తనదైన ముద్ర వేశారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన `వన్ ఫింగర్ రివొల్యూషన్` (క్యాప్‌స్టన్ యాప్) గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. ఒక వైపు సినిమాలు, మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్, మీడియా కాలేజ్ బాధ్యతలు నిర్వహిస్తూనే.. వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరుపై పలు విశేషాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... తన జీవితంలో అత్యుత్తమ పెట్టుబడి ఏంటని ప్రశ్నించగా..నాగార్జున తడుముకోకుండా `నా ఆరోగ్యమే నా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్` అని బదులిచ్చారు. 60 ఏళ్లు దాటినా నేటికీ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించే ఆయన ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే చెత్త ఇన్వెస్టిమెంట్ గురించి ప్ర‌శ్నించ‌గా... జీవితంలో చెత్త ఇన్వెస్ట్‌మెంట్ అంటూ ఏదీ ఉండదని... ప్రతి తప్పు లేదా ఓటమి మనకో మంచి పాఠాన్ని నేర్పి సరైన మార్గాన్ని చూపిస్తుందని స్పష్టం చేశారు.

ఇంటి నిర్వహణ- సర్వీసుల గురించి మాట్లాడుతూ...తాము గత 15 ఏళ్లుగా క్యాప్‌స్టన్ సంస్థ సేవలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. తాను తన సతీమణి అమల రోజంతా విభిన్నమైన పనులతో బిజీగా ఉంటామని.. ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్తే రాత్రికి కానీ రామని చెప్పారు. అలాంటి సమయంలో ఇల్లు శుభ్రంగా, ప్రొఫెషనల్‌గా నిర్వహించబడటం చాలా అవసరమని.. ప్రశాంతమైన - ఆహ్లాదకరమైన ఇల్లే సంతోషకరమైన కుటుంబానికి అసలైన పునాది అని నాగార్జున అభిప్రాయపడ్డారు.

ఈ రోజుల్లో సాంకేతికత పెరిగిన తీరును వివరిస్తూ... హోమ్ సర్వీసెస్ యాప్స్ భవిష్యత్తులో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఆన్‌లైన్‌లో కూరగాయలు కొంటామని, లేదా గుర్తుతెలియని వ్యక్తుల బైక్‌లపై రాపిడోలో ప్రయాణిస్తామని ఎవరూ ఊహించలేదని... కానీ నేడు అవన్నీ మన జీవితంలో భాగంగా మారిపోయాయని గుర్తుచేశారు. దాదాపు 18 ఏళ్ల అనుభవం ఉన్న ఇటువంటి విశ్వసనీయమైన సంస్థలు హోమ్ సర్వీసెస్ డిజిటల్ రంగానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని కొనియాడారు.

చివరగా ఇంట్లో పనిచేసే సిబ్బందిపై నమ్మకం అనేది వారితో మనకున్న బంధం నుండి వస్తుందని నాగార్జున చెప్పారు. పని పై నిబద్ధత, వర్క్ ఎథిక్స్ ఉన్న సిబ్బంది తన వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్నారని... వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే సరైన పద్ధతి అని తెలిపారు. సినిమాలు, వ్యాపారం, ఫిట్‌నెస్ ఇలా ప్రతి విషయంలోనూ ఒక క్రమశిక్షణతో వ్యవహరించే నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.