Begin typing your search above and press return to search.

'గీతాంజ‌లి'తో నాగ్ పాన్ ఇండియా స్టార్?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మానియాకు నాగార్జున స్టార్ ప‌వ‌ర్ యాడ‌వ్వ‌డం వ‌ల్ల‌నే ఈ స్థాయి ఓపెనింగులు సాధ్య‌మయ్యాయ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

By:  Sivaji Kontham   |   17 Aug 2025 11:06 PM IST
గీతాంజ‌లితో నాగ్ పాన్ ఇండియా స్టార్?
X

కింగ్ నాగార్జున నటించిన `కూలీ` ఇటీవ‌లే విడుద‌లై భారీ ఓపెనింగులు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మానియాకు నాగార్జున స్టార్ ప‌వ‌ర్ యాడ‌వ్వ‌డం వ‌ల్ల‌నే ఈ స్థాయి ఓపెనింగులు సాధ్య‌మయ్యాయ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఇద్ద‌రు పెద్ద స్టార్ల కార‌ణంగా ఓపెనింగులు వ‌చ్చినా కంటెంట్ ప‌రంగా ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేద‌ని విమ‌ర్శ‌లు రావ‌డం `కూలీ`కి అతి పెద్ద మైన‌స్. సోమ‌వారం నుంచి కూలీ బాక్సాఫీస్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఈ స‌మ‌యంలో కింగ్ త‌న సినిమాని వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో నాగార్జున తాను న‌టించిన గీతాంజ‌లి మూవీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని షేర్ చేసారు. డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంతో `గీతాంజ‌లి` సినిమా విజ‌య‌వంతంగా సెట్స్ కి వెళ్ల‌డానికి తాను ఎంత ప‌ట్టుద‌ల‌గా అత‌డి వెంట ప‌డ్డాడో చెప్పారు నాగ్. దాదాపు ఆరు నెల‌ల పాటు మ‌ణిర‌త్నం చుట్టూ తిరిగాను. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల‌కు ఆయ‌న‌ ఆఫీస్‌కు చేరుకునేవాడిని. ఆ స‌మ‌యంలో మార్నింగ్ వాక్ లో ఉండేవారు. చివ‌రికి `గీతాంజలి` చేయమని ఒప్పించానని నాగ్ చెప్పారు. మొద‌ట త‌మిళంలో ఈ సినిమా చేయాల‌నుకున్నా తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు తెలుగు వెర్ష‌న్ కూడా చేయాల‌ని తాను మ‌ణిర‌త్నంకి సూచించిన‌ట్టు నాగ్ చెప్పారు.

తన‌కు ప‌రిశ్ర‌మ‌లో ఏఎన్నార్ కుమారుడిగా ఎంతో క్రేజ్ ఉంది. అందువ‌ల్ల త‌న‌ను పెద్ద తెర‌పై చూడాల‌ని ప్ర‌జ‌లు ఆరాట‌ప‌డ్డారు. కానీ తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎద‌గ‌డానికి చాలా శ్ర‌మించాల్సి వచ్చింద‌ని నాగార్జున చెప్పారు. త‌న‌ను పెద్ద స్టార్‌ కొడుకుగా చూడ‌టం కొంత‌వ‌ర‌కూ అంచ‌నాల‌ను పెంచేది. దాంతో కెరీర్ ఆరంభం కొన్ని వైఫ‌ల్యాల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయితే త‌న సొంత డెసిష‌న్స్ తో ఆఖరి పోరాటం, మజ్ను స‌హా ప‌లు చిత్రాల‌లో నాగ్ న‌టించారు. అందులో `మ‌జ్ను` బిగ్ బ్రేక్ ఇచ్చింద‌ని ఆయన అన్నారు. గీతాంజ‌లి, మ‌జ్ను చిత్రాలు నాగార్జున కెరీర్ లో క్లాసిక్స్‌గా రికార్డుల్లో ఉన్నాయి.

గీతాంజ‌లి భార‌తీయ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌ర్ గ్రీన్ సినిమాల్లో ఒక‌టి. కానీ ఇది క‌మ‌ర్షియ‌ల్ గా ఆశించిన రేంజుకు చేర‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. కానీ నాగార్జున‌కు పాన్ ఇండియాలో ఫాలోయింగ్ పెరిగింది. హిందీ బెల్ట్ లోను క్లాసిక్ గీతాంజ‌లి(1987)కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ చిత్రంలో ఇద్ద‌రు అనారోగ్యంతో మ‌ర‌ణానికి చేరువగా ఉన్న ప్రేమికులుగా నాగార్జున- గీత జంట న‌ట‌న మ‌రో లెవ‌ల్. గీతాంజ‌లి త‌ర్వాత మ‌రో రెండేళ్ల‌కు ఆర్జీవీతో శివ (1989) అనే క‌ల్ట్ క్లాసిక్ ని నాగ్ ప్లాన్ చేసారు. నిజానికి ఈరోజుల్లో పాన్ ఇండియా అంటూ ఊక‌దంపుడు ప్ర‌చారం చేస్తున్నారు కానీ, గీతాంజ‌లి, శివ చిత్రాలతో దేశ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించిన స్టార్ గా నాగార్జున పేరు ఆరోజుల్లోనే మార్మోగింది.