Begin typing your search above and press return to search.

కింగ్ ఓకే చెప్తే.. భాస్కర్ కెరీర్ మలుపు తిరుగుతుందా?

ఒక్క సినిమా.. ఒక్క విజయం.. దర్శకుడి కెరీర్‌ ను పూర్తిగా మార్చేస్తుంది. అలాగే ఒక్క పెద్ద హీరోతో వచ్చే ఛాన్స్ కూడా దర్శకుడికి కొత్త లైఫ్ ఇవ్వగలదు.

By:  M Prashanth   |   13 July 2026 12:26 PM IST
కింగ్ ఓకే చెప్తే.. భాస్కర్ కెరీర్ మలుపు తిరుగుతుందా?
X

ఒక్క సినిమా.. ఒక్క విజయం.. దర్శకుడి కెరీర్‌ ను పూర్తిగా మార్చేస్తుంది. అలాగే ఒక్క పెద్ద హీరోతో వచ్చే ఛాన్స్ కూడా దర్శకుడికి కొత్త లైఫ్ ఇవ్వగలదు. ఇప్పుడు దర్శకుడు భాస్కర్ విషయంలో కూడా ఇలాంటి చర్చే టాలీవుడ్‌లో వినిపిస్తోంది. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున 101వ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఆ వార్త నిజమైతే భాస్కర్‌ కు ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు.. కెరీర్‌ ను మళ్లీ గాడిలో పెట్టే అవకాశంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బొమ్మరిల్లు సినిమాతో కుటుంబ కథలకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు భాస్కర్, ఎమోషన్స్ ను నేచరుల్ గా స్క్రీన్ పై చూపించగల దర్శకుడిగా పేరు సంపాదించారు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. మంచి కథలు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో ఒకప్పుడు స్టార్ దర్శకుల జాబితాలో ఉన్న భాస్కర్, మళ్లీ విజయానికి ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో నాగార్జునతో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భాస్కర్ నాగ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టోరీపై చర్చలు జరుగుతున్నాయని, కథ నచ్చితేనే కింగ్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే కేవలం నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే భాస్కర్ కెరీర్‌ ను మార్చేస్తుందని చెప్పలేం. ఆ అవకాశాన్ని ఎంత బలంగా వినియోగించుకుంటారన్నదే అసలు విషయం.

కథ కొత్తగా ఉండాలి. భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేయాలి. స్క్రీన్ ప్లే మొదటి నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా సాగాలి. ముఖ్యంగా నాగార్జున ఇమేజ్‌ కు తగ్గట్టే కాకుండా, ప్రస్తుత ప్రేక్షకుల టేస్టుకు కూడా సరిపోయేలా సినిమా రూపొందితేనే ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. నాగార్జున కెరీర్‌ ను పరిశీలిస్తే కొత్త కథలు, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కథలో విషయం ఉంటే దర్శకుడి గత విజయాలు, అపజయాలను పెద్దగా పట్టించుకోకుండా అవకాశం ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అందుకే భాస్కర్ కథ నిజంగా నాగార్జునను మెప్పిస్తే ఆ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాకే తదుపరి ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆ కాంబోపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయినప్పటికీ ఆ విషయం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అయితే ఆ ఛాన్స్ భాస్కర్‌ కు నిజమైన మలుపు కావాలంటే ఒక కండీషన్ మాత్రం తప్పనిసరి. నాగార్జున ఓకే చెప్పడం మాత్రమే కాదు.. ప్రేక్షకుల అంచనాలను అందుకునే కథతో, హృదయాన్ని తాకే భావోద్వేగాలతో, పూర్తి స్థాయి వినోదాన్ని అందించే సినిమాను భాస్కర్ తెరకెక్కించాలి. అలా జరిగితేనే ఆ ప్రాజెక్ట్ ఆయన కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.