#King100.. టెన్షన్ తీరింది
ఐతే కార్తీక్ తొలి సినిమా ‘ఆకాశం’ క్లాస్‌గా ఉంటుంది. అలాంటి సినిమా తీసిన దర్శకుడు నాగ్ వందో సినిమాను డైరెక్ట్ చేయడం ఏంటి అనుకున్నారు అభిమానులు.
By: Garuda Media | 21 Aug 2025 2:00 AM ISTఅక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావట్లేదు. మోహన్ రాజా సహా వేర్వేరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పక్కకు వెళ్లిపోయాయి. చివరికి తమిళ దర్శకుడే అయిన రా.కార్తీక్ అనే యంగ్ టెక్నీషియన్‌తో నాగ్ జట్టు కట్టబోతున్నట్లు కొన్ని నెలల ముందే వార్తలు వచ్చాయి. కానీ ఇతనైనా ఖాయమేనా అని నాగ్ ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నాగ్.. కార్తీక్‌తో ట్రావెల్ చేస్తున్న మాట వాస్తవమే అని తర్వాత క్లారిటీ వచ్చింది.
ఐతే కార్తీక్ తొలి సినిమా ‘ఆకాశం’ క్లాస్‌గా ఉంటుంది. అలాంటి సినిమా తీసిన దర్శకుడు నాగ్ వందో సినిమాను డైరెక్ట్ చేయడం ఏంటి అనుకున్నారు అభిమానులు. వందో సినిమా అంటే మాస్, యాక్షన్‌తో భారీగా ఉండాలన్నది వారి ఆశ. ఇదిలా ఉంటే.. తమిళ హిట్ మూవీ ‘అయోత్తి’ని నాగ్‌తో కార్తీక్ రీమేక్ చేస్తున్నాడనే వార్తలు వారిలో మరింత గుబులు పుట్టించాయి. ‘అయోత్తి’ మంచి సినిమానే అయినా అందులో హీరోయిజం ఏమీ ఉండదు. మరీ సింపుల్ స్టోరీ. నాగ్ వందో సినిమాగా చేయాల్సిన కథ ఇది ఎంతమాత్రం కాదు. ఐతే నాగార్జున తాజాగా జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షోలో పాల్గొని తన వందో సినిమా మీద క్లారిటీ ఇచ్చేశాడు. అభిమానుల టెన్షన్ తీర్చేశాడు.
కార్తీక్‌తో తాను చేయబోయేది రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీనే అని ఆయన సంకేతాలు ఇచ్చారు. అది గ్రాండియర్ ఉన్న సినిమా అని, భారీ యాక్షన్ ఉంటుందని.. దాంతో పాటే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఉంటాయని స్పష్టం చేశాడు. దీంతో కార్తీక్ తన తొలి సినిమా తరహా కథతో నాగ్ దగ్గరికి రాలేదని.. అది రీమేక్ కూడా కాదని.. మైల్ స్టోన్ మూవీ స్థాయికి తగ్గట్లే భారీగానే ఏదో చేయబోతున్నారని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆగస్టు 29న నాగ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఆ రోజు నాగ్ చేయబోయేది ఎలాంటి కథ అన్నది మరింత క్లారిటీ రావచ్చు.
