నాగబంధం వర్సెస్ రావు బహదూర్... బాక్సాఫీస్ రిపోర్ట్
గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నాగబంధం', 'రావు బహదూర్' సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 6 July 2026 1:25 PM ISTగత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు 'నాగబంధం', 'రావు బహదూర్' సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. మొదటి మూడు రోజులు రెండు సినిమాలకు మంచి స్పందన దక్కింది. రివ్యూలతో సంబంధం లేకుండా శని, ఆదివారాల్లో ప్రేక్షకులు థియేటర్ బాట పట్టారు. రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దక్కినట్లుగానే చెప్పాలి. అయితే నాగబంధం కి పెట్టిన బడ్జెట్‌తో పోల్చితే వచ్చిన వసూల్లు తక్కువగా అనిపిస్తున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక సత్యదేవ్ నటించిన రావు బహదూర్ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్‌లో రూపొందిన కారణంగా వీకెండ్‌లో వచ్చిన వసూళ్లతో బ్రేక్ ఈవెన్‌కి చేరువ అయ్యిందని సమాచారం అందుతోంది. నాగబంధం బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేటి నుంచి వీక్ డేస్ కావడంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రభావం ఎంత ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
సమంత మా ఇంటి బంగారం కలెక్షన్స్..
సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా స్ట్రాంగ్‌గానే ఈ వీకెండ్‌లోనూ ఉన్నప్పటికీ నాగబంధం కు చేసిన పబ్లిసిటీ కారణంగా మంచి రీచ్ వచ్చింది. దాంతో కొత్త హీరో అని చూడకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చారు. సినిమాకు ఎలాంటి టాక్ రాకముందే కొత్త హీరో సినిమాకు థియేటర్‌లో జనాలు ఉన్నారు అంటే ఏ స్థాయిలో పబ్లిసిటీ చేశారో అర్థం చేసుకోవచ్చు. నాగబంధం సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా చూస్తే రూ.3.25 కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగు వర్షన్ నుంచి రూ.2.8 కోట్లను నాగబంధం రాబట్టింది. ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేసినప్పటికీ అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక శని ఆది వారాల్లోనూ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో నాగబంధం సినిమాకు రూ.13 కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సత్యదేవ్ హీరోగా రావు బహదూర్ మూవీ...
ఇక సత్యదేవ్ నటనతో అరిపించిన 'రావు బహదూర్' సినిమాకు మొదటి రోజు రూ.3.9 కోట్లు వచ్చినట్లు మేకర్స్ నుంచి సమాచారం వచ్చింది. వీకెండ్‌లోనూ సినిమా ఆడియన్స్‌ను రప్పించుకుంది. మొదటి రోజుతో పోల్చితే మూడవ రోజు వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ లెక్కన చూస్తే సినిమా మొదటి మూడు రోజుల్లో రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని అంచనా. చిత్ర యూనిట్ సభ్యులు మొదటి మూడు రోజుల వసూళ్లకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. సోమవారం అయిన నేడు సైతం రావు బహదూర్ కి మంచి వసూళ్లు ఉన్నట్లుగా బాక్సాఫీస్ రిపోర్ట్ అందుతోంది. దాంతో ఈ వీకెండ్ వరకు కచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యం కాబోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగబంధం కలెక్షన్స్..
నాగబంధం సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కథ, కథనం లో బలం లేదు అంటూ రివ్యూలు వచ్చాయి. కొందరు ప్రేక్షకులు విజువల్ వండర్ అన్నట్లుగా చెబుతూనే, ఇంకాస్త ఎమోషన్స్ ఉంటే బాగుండేది అన్నట్లుగా చెబుతున్న మాటలు సినిమా వసూళ్లను మెల్ల మెల్లగా తగ్గిస్తున్నాయి. సోమవారం అయిన నేడు నాగబంధం కు పర్వాలేదు అన్నట్లుగా వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంలో నాగబంధం నిలబడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. రెండు సినిమాలను పోల్చినట్లయితే వసూళ్ళ పరంగా పెద్దగా తేడా లేదు. కానీ నాగబంధం సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కనుక వస్తున్ వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా అనిపించడం లేదట. రావు బహదూర్ మాత్రం నిర్మాతలకు ఎంతో కొంత లాభాలను మిగల్చడం ఖాయంగా తెలుస్తోంది.
