Begin typing your search above and press return to search.

'నాగబంధం' క్లిక్ అయితే.. లోకల్ టాలెంట్ వైపే అందరి చూపు?

భారీ బడ్జెట్, మైథలాజికల్ కథ, విజువల్ ఎఫెక్ట్స్.. ఆ మూడు అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. జులై 3వ తేదీన విడుదల కానున్న ఆ సినిమా రిజల్ట్ కోసం ఇప్పుడు సినీ అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

By:  M Prashanth   |   2 July 2026 7:17 PM IST
నాగబంధం క్లిక్ అయితే.. లోకల్ టాలెంట్ వైపే అందరి చూపు?
X

భారీ బడ్జెట్, మైథలాజికల్ కథ, విజువల్ ఎఫెక్ట్స్.. ఆ మూడు అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్. జులై 3వ తేదీన విడుదల కానున్న ఆ సినిమా రిజల్ట్ కోసం ఇప్పుడు సినీ అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణం కేవలం మూవీ కథ మాత్రమే కాదు.. సినిమాలో కనిపించనున్న లోకల్ విజువల్ ఎఫెక్ట్స్ టాలెంట్ కూడా.

ఇటీవలి కాలంలో సినీ ప్రియులు కథతో పాటు విజువల్ క్వాలిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. ముఖ్యంగా ఫాంటసీ, మైథలాజికల్ సినిమాల్లో గ్రాఫిక్స్ బాగోలేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే అలాంటి సిచ్యూవేషన్స్ వచ్చాయి కూడా. అలాంటి సమయంలో నాగబంధం మూవీ ట్రైలర్, టీజర్‌ లో కనిపించిన విజువల్స్ మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నాగసర్పాలు, పురాతన నిధి, అడ్వెంచర్ అంశాలను ఆకట్టుకునేలా చూపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అదే సమయంలో నాగబంధం సినిమాకు దర్శకత్వం వహించిన అభిషేక్ నామా విజువల్ ఎఫెక్ట్స్ పై మంచి అవగాహన ఉన్న వ్యక్తి కావడం మరో ప్రత్యేకత. ఏ సీన్ కు ఎలాంటి విజువల్ అవసరమో ముందుగానే ప్లాన్ చేసి, అందుకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ రూపొందించినట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఫారిన్ కంపెనీలపై ఆధారపడకుండా హైదరాబాద్‌ లోని ఎక్కువ భాగం వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం.

ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. గతంలో హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలు కూడా లోకల్ టెక్నికల్ టాలెంట్‌ తో రూపొందిన విజువల్స్‌ కు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆ సినిమాల విజయాల్లో వీఎఫ్‌ ఎక్స్ కీలక పాత్ర పోషించాయనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు నాగబంధం మూవీ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తే.. పెద్ద సినిమాల కోసం విదేశీ సంస్థలకే వెళ్లాల్సిన అవసరం లేదనే నమ్మకం మరింత బలపడే అవకాశం ఉంది.

సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందన్నది ఒక ఆసక్తికర అంశం. అయితే అంతకంటే ఎక్కువగా.. సిల్వర్ స్క్రీన్ పై కనిపించే విజువల్ క్వాలిటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేదే అంతా గమనిస్తున్నారు. ఒకవేళ నాగబంధం మూవీ కంటెంట్‌ తో పాటు విజువల్స్‌ తోనూ మెప్పిస్తే.. మన లోకల్ వీఎఫ్‌ ఎక్స్ టెక్నీషియన్స్ కు కచ్చితంగా మరిన్ని భారీ అవకాశాలు రావచ్చు.

అదే సమయంలో టాలీవుడ్ లో లోకల్ టాలెంట్‌ తో కూడా ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్ అందించవచ్చనే నమ్మకాన్ని మరింత బలపరిచే చిత్రంగా నాగబంధం నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. మరి ఏదేమైనా ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఎంతటి హిట్ అవుతుందో.. విజువల్స్ పరంగా నాగబంధం ఎంతలా ఆకట్టుకుంటుందో మరికొన్ని రోజులపాటు వేచి చూడాలి.