నాగబంధం.. అందాల బొమ్మలు ఇలా..
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్లతో సందడి చేస్తున్నారు.
By: M Prashanth | 11 March 2026 1:09 PM ISTఅభిషేక్ నామ దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న మైథాలజీ ఫాంటసీ చిత్రం ‘నాగబంధం’ మొదటి నుంచి కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. నిర్మాత నుంచి దర్శకుడిగా మారిన అభిషేక్ ప్రస్తుత జనరేషన్ కు ఇష్టమయ్యే డిఫరెంట్ అడ్వెంచర్ సినిమాను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ కోసమే కోట్లల్లో ఖర్చు చేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్లతో సందడి చేస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాట ‘నమో రే’ ప్రోమోను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పూర్తి స్థాయి సాంగ్‌ను మార్చి 15వ తేదీన ఉదయం 11:11 గంటలకు విడుదల చేయబోతున్నారు. పురాతన నిధులు, అతీంద్రియ శక్తుల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్‌లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ క్లాసికల్ డ్యాన్స్ ముద్రల్లో కనిపిస్తున్నారు. ఒక పురాతన ఆలయం ముందు సంప్రదాయబద్ధమైన దుస్తులు, ఆభరణాలతో ఉన్న వీరిద్దరి లుక్స్ చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాయి. ఈ పాట ఆధ్యాత్మికతో మెలోడీగా ఉండబోతోందని పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. జునైద్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
టీజర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమా విజువల్స్ పట్ల సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. డైలాగులు లేకుండా కేవలం నేపథ్య సంగీతం, గ్రాఫిక్స్‌తోనే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన దర్శకుడు, ఇప్పుడు పాటల ద్వారా సినిమాలోని ఎమోషన్‌ను హైలెట్ చేయాలని చూస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి.
మొదటి చిత్రం ‘పెద్దకాపు’తో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన విరాట్ కర్ణ, ఈసారి ఒక యోధుడి పాత్రలో తన సత్తా చాటబోతున్నారు. దైవత్వానికి, విధ్వంసానికి మధ్య సాగే ఈ పోరాటంలో శివుని అంశతో కూడిన కథాంశం ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక వేసవి కానుకగా విడుదల కాబోతున్న ‘నాగబంధం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
