జైలర్-2 రేట్ల పెంపు.. నాగవంశీ వాదనలో నిజమెంత?
దసరాకు తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఐతే అందులో అందరి దృష్టీ నిలిచింది జైలర్-2, రణబాలి సినిమాల మీదే.
By: Garuda Media | 18 Oct 2026 12:34 PM ISTదసరాకు రిలీజైన పెద్ద సినిమాల్లో స్ట్రెయిట్ మూవీ అయిన ‘రణబాలి’ తెలుగు రాష్ట్రాల్లో నార్మల్ రేట్లతోనే రిలీజైంది. కానీ డబ్బింగ్ మూవీ అయిన ‘జైలర్-2’కు మాత్రం ఏపీలో అదనంగా రేట్లు పెంచారు. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 మేర ఎక్స్ట్రా రేట్లు వడ్డించడం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం ‘జైలర్-2’కు తెలుగులో ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు, రజినీకాంత్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయలేదు.. అలాంటి సినిమాకు ఈ అదనపు రేట్లేంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. మీడియాలో కూడా దీని మీద పెద్ద చర్చ నడిచింది. ఐతే ఈ విషయం మీద ఇప్పుడు నాగవంశీ స్పందించాడు.
రేట్లు పెంచేస్తున్నాం.. రేట్లు పెంచేస్తున్నాం అని రుద్దకండి అంటూ ఆయన మీడియా మీద అసహనం వ్యక్తం చేశాడు.. దేశంలో చాలా చోట్ల కంటే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు తక్కువున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు వంద ఉదాహరణలు చూపిస్తానన్నాడు నాగవంశీ. తమిళనాడులో తమిళ సినిమాకు తక్కువ రేట్లున్నాయి.. తెలుగులో రేట్లు ఎక్కువ అన్న వాదన తప్పని నాగవంశీ తేల్చేశాడు. కోయంబత్తూరు లాంటి సిటీల్లో చూస్తే ‘జైలర్-2’కు ఎక్కువ రేట్లున్నాయని.. విజయవాడ, కాకినాడల్లో అంతకంటే రేట్లు తక్కువ అని నాగవంశీ స్పష్టం చేశాడు. అలాగే తాము రేట్లు పెంచింది కూడా చిన్న సెంటర్లలో 50-100 రేట్లు ఉన్నాయన్న ఉద్దేశంతో, ఆ గ్యాప్ కవర్ చేద్దామనే తప్ప మరేం కాదని ఆయన వివరణ ఇచ్చాడు. ఐతే ఈ వాదనలో నిజమెంత అని చూస్తే.. నాగవంశీ శుద్ధ అబద్ధం చెప్పారని అర్థమవుతుంది. కోయంబత్తూరులో ‘జైలర్-2’కి పీవీఆర్, ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సుల్లో రూ.183 రేటే ఉంది. కానీ విజయవాడ, కాకినాడల్లో మల్టీప్లెక్స్ రేటు రూ.252 కాగా.. సింగిల్ స్క్రీన్లలో రూ.195తో టికెట్లు అమ్ముతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాట రేట్లు ఎక్కువ అని నాగవంశీ ఎలా అన్నాడో? చిన్న సెంటర్లలో, లో క్లాస్లో రేట్లు తక్కువ అని అంటున్నపుడు.. అక్కడి వరకే రేట్లు పెంచాలి కానీ.. పెద్ద సెంటర్లలో.. అలాగే హైక్లాసుల్లో, మల్టీప్లెక్సుల్లో ఎందుకు రేట్లు పెంచారు అన్నది ప్రశ్న.
కంటెంట్ కన్నా ఎలివేషన్లే మిన్న
దసరాకు తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఐతే అందులో అందరి దృష్టీ నిలిచింది జైలర్-2, రణబాలి సినిమాల మీదే. ఇందులో కంటెంట్ పరంగా చూస్తే.. రణబాలిదే పైచేయి. ఇందులో మంచి కథ ఉంది. టీం ఎంతో ఎఫర్ట్ పెట్టింది. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఎంతో రీసెర్చ్ చేసి సిన్సియర్గా సినిమా తీశాడు. నిర్మాతలు సినిమా మార్కెట్ పరిమితులను మించి ఖర్చు పెట్టారు. ఇక హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంత మనసు పెట్టి సినిమా చేశారో తెర మీద కనిపిస్తుంది.
ఇంకోవైపు చూస్తే ‘జైలర్-2’ రొటీన్ మూవీ. అందులో చెప్పుకోదగ్గ కథ లేదు. ‘జైలర్’ స్టోరీనే రిపీట్ చేసినట్లు అనిపిస్తుంది. కేవలం రజినీకాంత్ చరిష్మాను వాడుకుంటూ.. అనిరుధ్ బీజీఎంతో సినిమాను లాగేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఐతే కంటెంట్ పరంగా ‘జైలర్-2’ కంటే ‘రణబాలి’ చాలా బెటర్ అయినా సరే.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
రొటీన్ సినిమా అయినా సరే.. ఎలివేషన్లు చాలు అనుకుంటున్న తెలుగు ప్రేక్షకులు ‘జైలర్-2’కే ఓటేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దగా హైప్ లేదు, అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రం అనుకుంటుంటే.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ‘జైలర్-2’. భారీ హైప్తో వచ్చిన ‘కూలీ’కి దాదాపు సమానంగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం. రెండో రోజు ఈ సినిమా వసూళ్లు తొలి రోజుకు దీటుగా ఉన్నాయి. మరోవైపు ‘రణబాలి’ సంగతి చూస్తే డే-1 ఆ చిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ.10 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. డబ్బింగ్ సినిమా జోరు ముందు అది నిలవలేకపోతోందన్నది స్పష్టం.
నిజానికి ‘రణబాలి’కి యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే వసూళ్లు ఇంకా తక్కువ వస్తాయనుకున్నారు. కానీ సాయంత్రానికి టాక్ బెటరైంది. వసూళ్లు స్టడీగానే కనిపించాయి. అయినా సరే ‘జైలర్-2’తో పోలిస్తే సినిమా వెనుకబడే ఉంది. వీకెండ్లో రజినీ సినిమా స్పష్టమైన పైచేయి సాధించబోతోందని, తెలుగులో ఇది మంచి లాభాలే అందిస్తుందని అర్థమవుతోంది. ‘రణబాలి’నే బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా కనిపిస్తోంది.
