Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌కు కోపమొస్తుందని లాభం వదిలేశాడా?

ఇప్పుడంతా ఇండస్ట్రీలో స్టార్ హీరోలదే రాజ్యం. వారి అభీష్టానికి తగ్గట్లే అన్నీ నడుస్తాయిక్కడ. ఎంత పెద్ద దర్శకుడైనా సరే, నిర్మాత అయినా సరే.. స్టార్ హీరోల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.

By:  Garuda Media   |   8 July 2026 6:00 AM IST
ఫ్యాన్స్‌కు కోపమొస్తుందని లాభం వదిలేశాడా?
X

ఇప్పుడంతా ఇండస్ట్రీలో స్టార్ హీరోలదే రాజ్యం. వారి అభీష్టానికి తగ్గట్లే అన్నీ నడుస్తాయిక్కడ. ఎంత పెద్ద దర్శకుడైనా సరే, నిర్మాత అయినా సరే.. స్టార్ హీరోల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. తాము ప్రొడ్యూస్ చేసిన సినిమా నష్టం తెచ్చిపెడితే.. కొన్ని నెలల తర్వాత కూడా ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి నిర్మాతలు ఇష్టపడరు. అందుక్కారణం.. సినిమా డిజాస్టర్ అని చెబితే హీరోకు కోపం వస్తుందేమో అని. దిల్ రాజు అంతటివాడు.. ‘గాయపడ్డ సింహం’ అనే సినిమా ఈవెంట్లో మీ కెరీర్లో మిమ్మల్ని అత్యంత గాయపరిచిన సినిమా ఏది అంటే ‘గేమ్ చేంజర్’ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. దీనికి జవాబు చెప్పించి నన్ను హీరో ఫ్యాన్స్ దృష్టిలో నన్ను విలన్ని చేద్దామనుకుంటున్నారా అంటూ సమాధానం దాటవేశారు. ఇండస్ట్రీలో హీరోల విషయంలో నిర్మాతలు ఎంత భయపడతారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇప్పుడు హీరోలు, వారి అభిమానుల విషయంలో నిర్మాతల భయం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ దొరికింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత.. దాన్ని ప్రమోట్ చేస్తే వేరే హీరో అభిమానులకు కోపం వస్తుందని వెనుకంజ వేశాడట. ఈ పని చేసింది ఇండస్ట్రీలో చాాలా ఓపెన్ టైపు అని పేరున్న నాగవంశీ కావడం గమనార్హం. ఆయన అర్జున్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘బ్లాస్ట్’ను తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా మంచి టాక్ వచ్చినా.. రిలీజ్ ముంగిట, తర్వాత సరిగా ప్రమోట్ చేయకపోవడంతో జనాలకు దీని గురించి పెద్దగా తెలియలేదు.

కానీ ఓటీటీలోకి వచ్చాక ‘బ్లాస్ట్ జోన్’ను తెలుగు ప్రేక్షకులు విరగబడి చూస్తున్నారు. థియేటర్లలో ఈ పేరుతో ఒక సినిమా వచ్చినట్లే తెలియలేదే అని కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ చిత్రానికి ఎందుకు పెద్దగా ప్రమోషన్లు చేయలేదు అని నాగవంశీని అడిగితే.. ముందు పెద్దగా టైం లేదని చెప్పాడు. అంతేకాక ఈ సినిమా రిలీజైన తర్వాతి వారంలో ‘పెద్ది’ విడుదలవుతుండడంతో.. తాను మైక్ పట్టి ‘బ్లాస్ట్ జోన్’ గురించి మాట్లాడితే తమ హీరో సినిమాను దెబ్బ కొట్టడానికే ఇలా చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్‌కు కోపం వస్తుందేమో అని భావించి ప్రమోషన్లు చేయలేదని చెప్పాడు. ఇలా ఒక హీరో ఫ్యాన్స్‌కు కోపం వస్తుందేమో అని తన సినిమా లాభాన్ని ఒక నిర్మాత వదులుకున్నట్లు చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. ఇక రామ్ చరణ్‌తో ఇప్పటిదాకా సినిమా చేయకపోవడం గురించి నాగవంశీ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని, ఎప్పట్నుంచో ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు నాగవంశీ.