A-సర్టిఫికెట్ సినిమాను ఫ్యామిలీ అంతా ఎలా చూస్తారు?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎపిక్' మూవీ విడుదలకు సిద్ధం అయింది.
By: Ramesh Palla | 9 Sept 2026 1:57 PM ISTఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎపిక్' మూవీ విడుదలకు సిద్ధం అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రష్మిక మందన్న హాజరు కాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ హాజరు కావడంతో సినిమాకి బజ్ మరింత పెరిగింది. పైగా బేబీ మూవీతో హిట్ కాంబోగా నిలిచిన ఆనంద్, వైష్ణవిల కాంబో మూవీ, అంతే కాకుండా 90's బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన కారణంగా మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. అన్ని విధాలుగా పాజిటివ్ వైబ్ ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికెట్ రావడం చర్చనీయాంశం అయింది. ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ సినిమా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శృతి మించిన రొమాంటిక్ సీన్స్ వల్ల A ఇచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఎపిక్ లో ముద్దు సీన్ రచ్చ...
ట్రైలర్‌లో హీరో హీరోయిన్ ముద్దు సీన్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆ సీన్‌ను చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముద్దు సీన్ వల్ల భారీ పబ్లిసిటీ రావడంతో పాటు, అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ విషయమై స్పందించాడు. సినిమాలోని ఒకే సన్నివేశం ఆధారంగా మొత్తం ఫలితాన్ని అంచనా వేయవద్దని అన్నాడు. ఒక బలమైన సన్నివేశం సమయంలోనే ఆ ముద్దు ఉంటుందని కూడా పేర్కొన్నాడు. సినిమాల హీరో, హీరోయిన్ మధ్య ఉండే సంబంధం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు అని నాగవంశీ చెబుతున్నాడు. తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందని, తమ బ్యానర్ నుంచి మరో మంచి సినిమాగా ఇది నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశాడు.
నాగవంశీ క్లారిటీ...
నాగవంశీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినిమాకు A సర్టిఫికెట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఎలా వెళ్తారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలు, అన్ని వయసుల వారు ఉంటారు. మరి వారు అంతా A సర్టిఫికెట్ సినిమాను ఎలా చూస్తారు, అందుకు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. థియేటర్ల వద్ద A సర్టిఫికెట్ సినిమాకు చిన్న పిల్లల అనుమతి తిరస్కరిస్తారు. కనుక ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ సినిమాకు వెళ్లడం సాధ్యం కాదు వంశీ భయ్యా అంటూ కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి A సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమా అందరికి కాదు, కొందరికే, అది కూడా పెద్దలకు మాత్రమే అని చెప్పినట్లు అయిందని, ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూడవచ్చు, మంచి మూవీ అని ఎలా అంటారు అనేది నాగవంశీకే తెలియాలి అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా..
విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో ముద్దు సీన్ వల్ల లక్ కలిసి వచ్చి కమర్షియల్‌గా బిగ్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండకు లక్ కలిసి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముద్దు సీన్ పెట్టి ఉంటారని, అంతే కాకుండా A సర్టిఫికెట్ సీన్స్ సైతం ఆ కారణం వల్లే పెట్టి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. ఎపిక్ మూవీ మొదలు అయినప్పటి నుంచి ఒక డీసెంట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన పెద్దలకు మాత్రమే సర్టిఫికెట్ చూసి షాక్ అయ్యామని కొందరు అంటున్నారు. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా రొమాంటిక్ సీన్స్ పెట్టిన యూనిట్ సభ్యులు ఫ్యామిలీ ఆడియన్స్ ను రమ్మంటే ఎలా అనేది చూడాలి.
