Begin typing your search above and press return to search.

ఎగ్జిబిటర్లు (X) నిర్మాతలు: సింగిల్ స్క్రీన్ల అంతానికి కార‌కులెవ‌రు?

ఈ వ్యాఖ్యలకు నిర్మాత నాగవంశీ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న‌ ఎవ‌రి పేరునూ ప్ర‌స్థావించ‌కుండానే ప్ర‌శ్న‌కు సూటిగా జ‌వాబిచ్చారు.

By:  Sivaji Kontham   |   14 May 2026 9:25 AM IST
ఎగ్జిబిటర్లు (X) నిర్మాతలు: సింగిల్ స్క్రీన్ల అంతానికి కార‌కులెవ‌రు?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడపై జరుగుతున్న చర్చ‌లో భాగంగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ త‌న వాద‌న‌ను వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత సింగిల్ స్క్రీన్ల పరిస్థితి దారుణంగా తయారైందని.. దీనికి బాధ్యులెవరనే అంశంపైనా పెద్ద చ‌ర్చ సాగుతోంది.

ఈ చర్చలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. సాంకేతికత పరంగా సింగిల్ స్క్రీన్లు వెనుకబడి ఉండటమే ప్రధాన సమస్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మల్టీప్లెక్సులలో డాల్బీ అట్మాస్ వంటి అధునాతన సౌండ్ సిస్టమ్స్ .. హై-క్వాలిటీ ప్రొజెక్షన్ అందించగలుగుతున్నామని... కానీ సింగిల్ స్క్రీన్లలో అటువంటి భారీ పెట్టుబడులతో కూడిన సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదని ఆయన వివరించారు. డాల్బీ వంటి కనీస ఆధునిక సౌకర్యాలు లేని థియేటర్లకు నేటి తరం ప్రేక్షకులు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు నిర్మాత నాగవంశీ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న‌ ఎవ‌రి పేరునూ ప్ర‌స్థావించ‌కుండానే ప్ర‌శ్న‌కు సూటిగా జ‌వాబిచ్చారు. నాగ‌వంశీ కౌంట‌ర్ వేస్తూ.. దాదాపు 300 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్న ఒక పెద్ద ఎగ్జిబిటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల బాధల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏ సెంట‌ర్ల‌లోనే కాదు.. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ.. ఆఖరికి బీ, సీ సెంటర్‌లలో కూడా మల్టీప్లెక్సులు నిర్మించి.. సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్‌ను లాగేసుకుంటున్న వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తోంది! అని నాగవంశీ నిలదీశారు. సింగిల్ స్క్రీన్ల అంతానికి అసలు కారకులు మల్టీప్లెక్స్ సామ్రాజ్యాలను విస్తరిస్తున్న వారేనని ఆయన పరోక్షంగా ఆరోపించారు.

మల్టీప్లెక్సుల మీద చూపిస్తున్న శ్రద్ధలో పదో వంతు కూడా సింగిల్ స్క్రీన్ల మీద చూపడం లేదని నాగవంశీ విమర్శించారు. ఒకవైపు మల్టీప్లెక్సులను విలాసవంతంగా తీర్చిదిద్దుతూ..మరోవైపు సింగిల్ స్క్రీన్లను `కుక్క తొట్టి` లాగా వాసన వచ్చే స్థితికి దిగజార్చారని నాగ‌వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లాభాల కోసం మల్టీప్లెక్సులను ప్రోత్సహిస్తూ.. సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే సింగిల్ స్క్రీన్లను ఎగ్జిబిటర్లే కావాలని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రస్తుతం తలెత్తిన ఈ పర్సంటేజీ వివాదం వెనుక కూడా మల్టీప్లెక్స్ లాబీయింగ్ పైనా ఇటీవ‌ల బోలెడంత చ‌ర్చ సాగుతోంది. సింగిల్ స్క్రీన్లను బాగుచేయడం చేతకాక.. నష్టాల సాకుతో పర్సంటేజీ విధానం కోరడం ద్వారా పంపిణీ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారని నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతున్న తరుణంలో `పెద్ది` వంటి పెద్ద సినిమాల విడుదల సమయానికి ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందో లేదోన‌న్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది.