టికెట్ ధరలు కాదు.. పాప్‌కార్న్ కోలాలే ప్రేక్షకులను దూరం చేస్తున్నాయి: నిర్మాత నాగవంశీ
టికెట్ ధరల కంటే థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలే అత్యంత భయంకరంగా ఉన్నాయని నాగవంశీ విమర్శించారు.
By: Sivaji Kontham | 14 May 2026 9:26 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల యజమాన్యాలు, నిర్మాతల మధ్య జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. తాజా మీడియా సెషన్ లో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలనే అంశంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ తనదైన శైలిలో స్పందించారు. కేవలం సినిమా టికెట్ ధరలు పెంచడం వల్లే జనం థియేటర్లకు రావడం లేదనే వాదనలో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. అసలు సమస్య ఎక్కడ ఉందో ఎగ్జిబిటర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూటిగా డిమాండ్ చేశారు.
ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి టికెట్ ధరల పెంపు ప్రధాన కారణం కాదని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అనుమతించిన మేరకు నిర్మాతలు పెంచే 50 లేదా 100 రూపాయల అదనపు ధర వల్ల సామాన్య ప్రేక్షకుడు సినిమా చూడటం మానేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాపై ఉన్న ఆసక్తితో ప్రేక్షకులు టికెట్ ధరను భరించడానికి సిద్ధంగానే ఉన్నారని.. కానీ థియేటర్ల లోపల వారికి ఎదురవుతున్న ఇతర ఖర్చులే వారిని బెంబేలెత్తిస్తున్నాయని నాగవంశీ పేర్కొన్నారు.
ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో సాగుతున్న అదనపు వసూళ్లపై నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు టికెట్ల ధర సుమారు 600 రూపాయలు ఉందనుకుంటే.. దానిపై అదనంగా రూ.150 నుంచి 200 రూపాయల వరకు వివిధ రూపాల్లో వసూలు చేస్తున్నారని ఆయన ఎత్తిచూపారు. ఇందులో`కన్వీనెన్స్ ఫీ` పేరుతో సుమారు 50 రూపాయలు అదనంగా భారం వేస్తున్నారని... ఇలాంటి అదృశ్య వసూళ్లు ప్రేక్షకుల జేబుకు చిల్లు పెడుతున్నాయని మండిపడ్డారు.
టికెట్ ధరల కంటే థియేటర్లలో విక్రయించే ఆహార పదార్థాల ధరలే అత్యంత భయంకరంగా ఉన్నాయని నాగవంశీ విమర్శించారు. `ముందు పాప్‌కార్న్, కోలాల ధరలను తగ్గించండి`` అని ఆయన ఎగ్జిబిటర్లను డిమాండ్ చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం థియేటర్‌కు వస్తే.. సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ భారాన్ని ప్రజలు మోయలేకపోతున్నారని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జర్నలిస్టులు కూడా ఎగ్జిబిటర్లను నిలదీయాలని ఆయన కోరారు.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం టికెట్ రేట్ల గురించి మాట్లాడటం మానేసి.. థియేటర్లలో జరిగే మిగతా దోపిడీని అరికట్టాలని నాగవంశీ హితవు పలికారు. ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి తెచ్చి... అదనపు ఫీజులను రద్దు చేస్తేనే సామాన్యుడు హాయిగా థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తాడన్నారు. పరిశ్రమ మనుగడ సాగాలంటే ప్రేక్షకుల సౌకర్యం .. వారి ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని యువ నిర్మాత నాగవంశీ నిర్మాతల తరపున ఈ సందర్భంగా గుర్తు చేశారు.
