టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ని హింసించిన ట్యాలెంటెడ్ హీరో?
నాగవంశీ వ్యాఖ్యల ప్రకారం.. అడివి శేష్ వంటి హీరోలు కథ విషయంలో లేదా మేకింగ్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు.
By: Sivaji Kontham | 8 April 2026 9:56 AM ISTటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తాజాగా `డెకాయిట్` చిత్రం ప్రమోషనల్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే నాగవంశీ.. హీరో అడివి శేష్ తన నిర్మాత సుప్రియను రెండేళ్ల పాటు ఇబ్బంది పెట్టాడని చేసిన సరదా వ్యాఖ్యలు సినిమా వెనుక ఉండే అసలు కష్టాలను మరోసారి గుర్తుచేశాయి. బయటి హీరోలతో సినిమాలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని.. నిర్మాతలకు ఉండే తలనొప్పులు ఎలా ఉంటాయో ఆయన తనదైన శైలిలో వివరించారు.
సినిమా రంగంలో హీరోల ఆధిపత్యం పెరిగిపోతోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గొంతెమ్మ కోర్కెలు కోరే హీరోయిన్లను సినిమా నుంచి వెంటనే తొలగించడం సులభమే కానీ.. హీరోల విషయంలో అది సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్లనే కొన్ని కారణాల వల్ల సినిమాల నుండి తప్పించిన దాఖలాలు ఉన్నాయి.. కానీ ఒక హీరో ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత నిర్మాతలకు ఎంతటి తలనొప్పులు ఎదురైనా భరించక తప్పని పరిస్థితి ఉంటుంది.
నాగవంశీ వ్యాఖ్యల ప్రకారం.. అడివి శేష్ వంటి హీరోలు కథ విషయంలో లేదా మేకింగ్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. ఈ క్రమంలో నిర్మాతలకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుకావచ్చు. సుప్రియ యార్లగడ్డ వంటి నిర్మాతలు తమ సొంత కుటుంబ హీరోలతో సినిమాలు చేయడం వల్ల బయటి హీరోల వల్ల కలిగే కష్టాలు తెలియడం లేదని నాగవంశీ చమత్కరించారు. ప్రతి హీరోకు ఉండే ప్రత్యేకమైన ఆలోచనా విధానం.. పని తీరు నిర్మాతలకు సవాల్‌గా మారుతాయని ఆయన మాటల సారాంశం.
నిర్మాతలు హీరోలను నెత్తిన పెట్టుకుంటున్నారని.. అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సుప్రియపై నాగవంశీ వేసిన పంచ్ నవ్వులు పూయించినా.. అందులో కొంత చేదు నిజం కూడా ఉంది. సినిమా విజయం ప్రధానంగా హీరో ఇమేజ్ పై ఆధారపడి ఉండటంతో వారి డిమాండ్లను కాదనలేక నిర్మాతలు సర్దుకుపోతుంటారు. అయితే శేష్ తనను ఇబ్బంది పెట్టినందుకు థాంక్స్ చెప్పడం ద్వారా.. ఆ `హింస` సినిమా నాణ్యత కోసమే జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా అంగీకరించారు.
మొత్తానికి వెండితెరపై మనం చూసే గ్లామర్ వెనుక నిర్మాత, హీరో మధ్య ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. బడ్జెట్ నియంత్రణ.. షూటింగ్ షెడ్యూల్స్.. క్రియేటివ్ విభేదాలు వంటివి నిర్మాతలను మానసికంగా హింసకు గురిచేస్తాయి. బయటి హీరోలతో పనిచేసేటప్పుడు ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. నాగవంశీ చేసిన ఈ చిలిపి విమర్శలు సినిమా నిర్మాణం అనేది కేవలం డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు.. మనుషుల మధ్య జరిగే ఒక పెద్ద సమరం అని స్పష్టం చేస్తున్నాయి.
