బాబాయ్ అండ్ అబ్బాయ్.. సరైన బిజినెస్ స్ట్రాటజీ..
సినిమా తీయడం ఒక లెక్క.. దాన్ని అమ్మడం మరో లెక్క. ఎక్కడ అమ్మాలి, ఎవరికి ఇవ్వాలి, అవసరమైతే సొంతంగా రిలీజ్ చేయాలా.. ఇలా ప్రతి స్టెప్ లో కూడా బిజినెస్ స్ట్రాటజీ ముఖ్యం.
By: M Prashanth | 17 Oct 2026 6:46 PM ISTసినిమా తీయడం ఒక లెక్క.. దాన్ని అమ్మడం మరో లెక్క. ఎక్కడ అమ్మాలి, ఎవరికి ఇవ్వాలి, అవసరమైతే సొంతంగా రిలీజ్ చేయాలా.. ఇలా ప్రతి స్టెప్ లో కూడా బిజినెస్ స్ట్రాటజీ ముఖ్యం. ఆ విషయంలో బాబాయ్ చినబాబు చూపిన దారిలోనే అబ్బాయ్ నాగవంశీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కొనడానికి బయ్యర్ ముందుకొస్తే అమ్మేయడానికే తొలి ఇంపార్టెన్స్ ఇస్తూ.. టాలీవుడ్ లో తమదైన బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సినిమాలు నిర్మిస్తున్న నాగవంశీ.. తన బాబాయ్ మొదటి నుంచీ ఫాలో అవుతున్న బిజినెస్ స్ట్రాటజీ తాము ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. సినిమా కొనడానికి బయ్యర్ సిద్ధంగా ఉంటే ముందుగా అమ్మడానికే ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ బయ్యర్ ముందుకు రాకపోతే సొంతంగా విడుదల చేసే అవకాశం ఉందని వివరించారు. ఆ మాటల్లోనే వారి బిజినెస్ క్లియర్ గా కనిపిస్తోంది.
సాధారణంగా సినిమా ప్రొడక్షన్ పూర్తయ్యాక దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, ఏ ప్రాంతంలో ఎవరికి అమ్మాలనే అంశాలపై నిర్మాతలు నిర్ణయం తీసుకుంటారు. అయితే నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను కూడా తీసుకుంటే ఎక్స్ ట్రా ఖర్చులు, రిస్క్ లు ఉంటాయి. అందుకే ముందుగానే బయ్యర్లు ముందుకొస్తే సినిమాను వారికి ఇచ్చేయడం ద్వారా బిజినెస్ బర్డన్ ను తగ్గించుకోవచ్చు. అదే సమయంలో బయ్యర్లకు కూడా సినిమా మీద నమ్మకం ఉంటే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే సినిమా బిజినెస్ లో అమ్మకాలు, సొంత రిలీజ్ రెండింటికీ లాభనష్టాలు ఉంటాయి. బయ్యర్ కు సినిమా అమ్మితే నిర్మాతకు అగ్రిమెంట్ ప్రకారం ఇన్కమ్ వస్తుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అమ్మకం ద్వారా వచ్చే ఇన్కమ్ ముందుగానే అర్థమవుతుంది. సొంతంగా విడుదల చేస్తే మాత్రం డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ప్రమోషన్, థియేటర్ల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్మాతపైనే ఉంటాయి. సినిమా సక్సెస్ అయితే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. తేడా కొడితే నష్టాల భారం కూడా పెరుగుతుంది.
అందుకే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఇక మైత్రీ మూవీ మేకర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా నాగవంశీ ప్రస్తావించారు. తన సినిమా హక్కులను కొనడానికి మైత్రీ ముందుకొస్తే వారికి ఇస్తామని, లేదంటే అన్నపూర్ణ సపోర్ట్ తో రిలీజ్ చేస్తామని వివరించారు. సితార సినిమాల డిస్ట్రిబ్యూషన్ ను మైత్రీ చూసుకునే సందర్భాలు ఉన్నాయని, తమ రెండు సంస్థలకు సంబంధం లేని ఇతర సినిమాల విషయంలో కలిసి పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.
అయితే సొంత సంస్థల సినిమాలకే పరిమితం కాకుండా, ఇతర బ్యానర్ల సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో పార్టనర్ గా ఉండడం వల్ల బిజినెస్ ఛాన్సులు పెరుగుతాయి. అయితే ప్రతి సినిమాకు వేర్వేరు లెక్కలు ఉంటాయి. కాబట్టి పార్టనర్ షిప్ సక్సెస్ కావాలంటే అన్నింటిపై క్లారిటీ అవసరం. ప్రతి సినిమాను సొంతంగా విడుదల చేయాలనే కాకుండా, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కలిసి పనిచేయాలి, ఎప్పుడు ఓన్ రిలీజ్ చేయాలనే విషయాలను బట్టి అడుగులు వేయడమే బాబాయ్, అబ్బాయ్ ప్లాన్ గా కనిపిస్తోంది.
