నాగశౌర్య మాస్ అవతార్: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' ట్రైలర్ ఎలా ఉందంటే?
శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఇక నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
By: M Prashanth | 6 April 2026 7:19 PM ISTయువ హీరో నాగశౌర్య అనగానే సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి తన రూటు మార్చి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ దేసిన (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే టైటిల్ పెట్టారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఇక నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ట్రైలర్ ప్రారంభంలో నరేష్ వి.కె. పాత్ర దేవుడిని వేడుకోవడం ద్వారా అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను పరిచయం చేశారు. ఆ తర్వాత నాగశౌర్య ఎంట్రీ చాలా రగ్డ్ గా, ఊర మాస్ స్టైల్ లో సాగింది. కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా, ట్రైలర్ చివరలో లక్ష్మీ నరసింహ స్వామిని గుర్తుకు తెచ్చేలా నాగశౌర్య యాక్షన్ స్టిల్ చూస్తుంటే ఈసారి మాస్ యాంగిల్ ని గట్టిగానే టచ్ చేసినట్లు అర్ధమవుతుంది. ఒక పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను ఈ ట్రైలర్ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ ట్రైలర్ లో నాగశౌర్య బాడీ లాంగ్వేజ్ గత సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. మాస్ హీరోగా తనని తాను కొత్తగా హైలెట్ చేసుకోవాలని చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సముద్రఖని విలన్ గా కనిపించగా, సాయికుమార్ తో వచ్చే సీన్లు అటు సీరియస్ గానే కాకుండా కామెడీ యాంగిల్ లో కూడా ఉన్నాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి నటులు కూడా ఉండటంతో సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు కూడా లోటు ఉండదని అర్థమవుతోంది. యాక్షన్ బ్లాక్స్ లో నాగశౌర్య ఈసారి కంప్లీట్ గా కొత్తగా అయితే కనిపిస్తున్నాడు.
టెక్నికల్ పరంగా చూస్తే రసూల్ ఎల్లోర్ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హారిస్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేస్తోంది. ముఖ్యంగా రౌడీలను చైన్ తో కొట్టే సీన్లు, గాలిలోకి ఎగిరి తన్నే యాక్షన్ బ్లాక్స్ హై వోల్టేజ్ తో ఉన్నాయి. అలాగే సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ను కూడా టచ్ చేశారు. హీరోయిన్ విధి తన గ్లామర్ తో మెప్పిస్తోంది. కథలో ఎమోషన్ కు కూడా పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. నరేష్, శ్రీదేవి విజయ్ కుమార్ పాత్రలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఒక కొత్త దర్శకుడు రమేష్, నాగశౌర్యను ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ట్రైలర్ తో ఒక హింట్ ఇచ్చేశారు. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ తో నాగశౌర్య తనలోని మాస్ యాంగిల్ ను గట్టిగానే ప్రదర్శించారు. సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతున్న తరుణంలో, ఈ ట్రైలర్ తో బజ్ పెంచాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కేవలం సాఫ్ట్ రోల్స్ కే పరిమితం కాకుండా నాగశౌర్య చేస్తున్న ఈ మాస్ ప్రయోగం కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
