Begin typing your search above and press return to search.

వృషకర్మ.. సరైన చేతికే దక్కింది!

. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే గట్టిగానే జరిగింది.

By:  M Prashanth   |   26 Oct 2026 9:56 PM IST
వృషకర్మ.. సరైన చేతికే దక్కింది!
X

'తండేల్' సక్సెస్ తర్వాత నాగచైతన్య నుంచి రాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడంతో 'వృషకర్మ'పై మొదటి నుంచీ ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ ఉంది. రొటీన్ లవ్ స్టోరీలు పక్కనపెట్టి చైతూ చేస్తున్న మైథలాజికల్ అడ్వెంచర్ కావడం, 'విరూపాక్ష'తో తానేంటో ప్రూవ్ చేసుకున్న కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు సహజంగానే ఏర్పడ్డాయి. హారర్, మిస్టరీ ఎలిమెంట్స్ ను హ్యాండిల్ చేయడంలో సిద్ధహస్తుడైన కార్తీక్ ఈసారి భారీ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు.

ఈ సినిమా బడ్జెట్, స్కేల్ కూడా చైతూ గత చిత్రాల కంటే చాలా పెద్దది. బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే గట్టిగానే జరిగింది. డిజిటల్, శాటిలైట్ హక్కులే భారీ ధర పలికినట్లు సమాచారం. అయితే ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నప్పుడు థియేట్రికల్ గా సినిమాను అంతే బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే సరైన డిస్ట్రిబ్యూటర్ దొరకడం చాలా ముఖ్యం.

సరిగ్గా ఇక్కడే మేకర్స్ పక్కా ప్లానింగ్ తో అడుగు వేశారు. లేటెస్ట్ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక థియేట్రికల్ హక్కులను దిల్ రాజుకు చెందిన 'ఎస్వీసీ రిలీజ్' సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్కెట్ పల్స్ తెలిసిన దిల్ రాజు చేతికి మూడు రాష్ట్రాల హక్కులు వెళ్లడం నిజంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సరైన థియేటర్ల కేటాయింపు, మాగ్జిమమ్ షోలు దక్కేలా చేయడంలో ఆయనకున్న నెట్‌వర్క్ ఈ సినిమాకు సాలిడ్ పుష్ ఇస్తుంది.

అయితే ఈ పందెం అంత సులువుగా సాగేలా లేదు. డిసెంబర్ 4న వృషకర్మ ఒక్కటే బరిలో లేదు. అదే రోజున నితిన్ 'అలియాస్ రుక్మిణి', విశ్వక్ సేన్ 'లెగసీ' కూడా రిలీజ్ కాబోతున్నాయి. మూడు వేర్వేరు జోనర్ల సినిమాలు ఒకేసారి వస్తుండటంతో థియేటర్ల షేరింగ్ పెద్ద టాస్క్ గా మారనుంది. ఈ క్లాష్ లో దిల్ రాజు తన డిస్ట్రిబ్యూషన్ పవర్ ను ఉపయోగించి మెయిన్ సెంటర్లలో వృషకర్మకు ఏ మేరకు ప్రాధాన్యత ఇప్పిస్తారనేది కీలకం.

మరోవైపు కర్ణాటకలో ఓపెనింగ్స్ రాబట్టడం చైతూకు అసలైన పరీక్ష. పోస్టర్ లో ఐదు భాషల రిలీజ్ అని అనౌన్స్ చేసిన నేపథ్యంలో, కేవలం తెలుగు వెర్షన్ పైనే ఆధారపడకుండా ఇతర భాషల్లోనూ లోకల్ ప్రమోషన్స్ గట్టిగా చేయాల్సి ఉంటుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ నెగటివ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో నవంబర్ అంతా చైతూ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లలో దాచిన మిస్టరీ కంటెంట్ ను ట్రైలర్ లో ఎంతవరకు రివీల్ చేసి ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతారో చూడాలి.